Iran-US War : అమెరికా-ఇరాన్ మధ్య ఒకవైపు చర్చల ప్రతిపాదన కొనసాగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తాజాగా 13 మంది మరణించారు. ఎస్లాంషహర్ అనే పట్టణంతోపాటు షరిఫ్ యూనివర్సిటీపై వైమానిక దాడులు జరిగాయి. ఇక్కడి నివాస స్థలాలపై దాడులు జరగడంతో దాదాపు 13 మంది పౌరులు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
సోమవారం ఉదయం ఈ దాడులు జరిగాయి. అలాగే, షరీఫ్ టెక్నాలజీ యూనివర్సిటీపై దాడి చేయడంతో చాలా బిల్డింగులు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీ ఉంది. ఈ ఘటనతో యూనివర్సిటీ క్యాంపస్‌ను అధికారులు మూసేశారు. ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యూనివర్సిటీపై దాడి చేయడానికి ప్రత్యేక కారణం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి, ఇరాన్ మిలిటరీ కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీతో ఈ యూనివర్సిటీకి సంబంధం ఉందని ప్రచారంలో ఉంది. ఈ ప్రదేశాన్ని సైన్యం సెకండరీ పాయింట్‌గా మార్చుకున్నట్లు అనుమానాలున్నాయి. అందుకే ఇక్కడి దాడి జరిగి ఉంటుందని అంచనా.
ఇజ్రాయెల్ వైపు నుంచి కానీ, అమెరికా నుంచి కానీ ఈ దాడుల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరగడం విశేషం. మరోవైపు టెహ్రాన్ సమీపంలోని పట్టణమైన క్వామ్పై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. తాజాగా జరిగిన దాడుల్లో మరణించిన పౌరులు, సైనికులకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఇరాన్ వెల్లడించడం లేదు.