Indian Students | పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు (Indian Students) ఇరాన్ (Iran)ను వీడి అర్మేనియా (Armenia)కు క్షేమంగా చేరుకున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో రేపు ఢిల్లీకి రానున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.
మరోవైపు భారతీయులు (Indians) తక్షణమే టెహ్రాన్ (Tehran)ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ (Advisory) జారీ చేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది (+989010144557, +989128109115, +989128109109).
టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి
మరోవైపు టెహ్రాన్ ఎయిర్పోర్ట్ (Tehran airport)పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన రెండు F-14 యుద్ధ విమానాలు (F -14 fighter jets) ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్ దళాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్ వీటిని ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. తమ దాడిలో ఆ ఫైటర్ జెట్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది.
Also Read..
Israel-Iran | తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
Israel-Iran | టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి.. రెండు ఇరానియన్ F-14 యుద్ధ విమానాలు ధ్వంసం
China | టెహ్రాన్, టెల్ అవీవ్‌ను సాధ్యమైనంత త్వరగా వీడండి.. తమ పౌరులకు చైనీస్ ఎంబసీ అడ్వైజరీ