టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుండటంతో టెహ్రాన్ (Tehran) నుంచి వెళ్లిపోవాలని చైనా (China) తమ పౌరులకు సూచించింది. అదేవిధంగా టెల్ అవీవ్‌ను కూడా ఖాళీ చేయాలని హెచ్చరించింది. పౌర మరణాలు పెరుగుతుండటం, భద్రత క్షీణిస్తుండటంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలని సూచించింది. ఇజ్రాయెల్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను సాధ్యమైనంత త్వరగా విడిచి వెళ్లాలని, గగణతలాన్ని మూసివేసిన నేపథ్యంలో భూ మార్గంలో జోర్డాన్‌కు చేరుకోవాలని టెల్ అవీవ్‌లోని చైనీస్ ఎంబసీ (Chinese embassy) అడ్వైజరీ విడుదల చేసింది.
ఇదేవిధమైన ప్రకటన ఇజ్రాయెల్ కూడా చేసింది. తమ లక్ష్యాలు ఇంకా పూర్తికాకపోవడంతో ఇరాన్‌లోని ఆయుధాగారాల సమీపంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తమకు పట్టు చిక్కిందని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ పౌరులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో సమస్యను తగ్గించుకోవాలన్నారు. ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చామని తెలిపారు.