Myanmar | మయన్మార్‌ను (Myanmar) శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్ మయన్మార్ (Myanmar)లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.
ఈ భూకంపం ధాటికి మయన్మార్ మొత్తం వణికిపోయింది. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు ధ్వంసమయ్యాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి ధ్వంసమైంది. ఇది నగరంలోనే అతిపెద్దదని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనతో క్షతగాత్రులకు వీధుల్లోనే చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మండలేలో ప్రార్థనల సమయంలో ఓ మసీదు కూలిపోయింది. మొత్తంగా ఈ విపత్తులో ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 50 మంది వరకూ గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య వందల్లోనే ఉంటుందని సమాచారం.
థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ విధింపు
ఈ భూకంపం ధాటికి.. థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ (Bangkok)లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించింది. చతుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం కూలిపోయింది. ఇందులో దాదాపు 40 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలిసింది. అంతేకాదు భూకంపం తర్వాత అనేక భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. వ్యాపార సముదాయాలను మూసివేయించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం
తాజా విపత్తుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపం పరిస్థితిపై ఆందోళనగా ఉంది. అక్కడి ప్రజలందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నా. అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. సహాయక చర్యలపై మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరాను’ అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత్‌లోనూ భూ ప్రకంపనలు..
మయన్మార్‌లో సంభవించిన శక్తిమంతమైన భూకంపం ధాటికి థాయ్‌లాండ్, చైనాతోపాటూ భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతాతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, ఘాజియాబాద్, నోయిడా, మేఘాలయా, కోల్‌కతా, మణిపూర్‌లోని ఇంఫాల్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మేఘాలయా ఈస్ట్ గారోహిల్స్‌లో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో అన్న టెన్షన్‌తో ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
Also Read..
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు | Watch Video
PM Modi | క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం.. మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపంపై మోదీ ట్వీట్
PM Modi | థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు