న్యూఢిల్లీ: యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో 100 మందికి పైగా ప్రజలు వీరిలో అధికంగా పిల్లలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ ఆర్డబ్ల్యూ) తెలిపింది. గాజాలోని ప్రజలను నడుస్తున్న శవాలుగా అభివర్ణించిన ఏజెన్సీ జోర్డాన్, ఈజిప్టులో తమకు చెందిన 6,000 ట్రక్కుల లోడుతో సమానమైన ఆహార, వైద్య సరఫరాలు నిలిచి ఉన్నాయని తెలిపింది.
గాజాలోని ప్రజలు మరణించలేదు. అలాగని జీవించి కూడా లేరు. వారు నడుస్తున్న శవాలు అని గాజాలోని సహచర ఉద్యోగి ఒకరు తనతో వ్యాఖ్యానించిన విషయాన్ని ఏజెన్సీ చీఫ్ ఫిలిప్ లాజారిని శుక్రవారం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. గాజాలోని ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.