కాలిఫోర్నియా: కరోనా మహమ్మారి కారణంగా తన కంపెనీలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ ఓ వ్యక్తి మూడు వేర్వేరు బ్యాంకుల నుంచి 50 లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.36.68 కోట్లు) లోన్‌గా తీసుకున్నాడు. కానీ, ఆ లోన్ డబ్బుల నుంచి కోట్లు ఖర్చుపెట్టి విహారయాత్రలు చేశాడు. ఫెరారీ, బెంట్లీ, లాంబర్గిని లాంటి ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. కానీ, మోసం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు.
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కాలిఫోర్నియాకే చెందిన ముస్తఫా ఖాద్రి కరోనా కారణంగా దెబ్బతిన్న తన కంపెనీలకు లోన్ కావాలంటూ మూడు వేర్వేరు బ్యాంకులకు దరఖాస్తు చేశాడు. వాస్తవానికి అతనికి ఎలాంటి కంపెనీలు లేవు. లేని కంపెనీల పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. అందుకోసం పలువురి సంతకాలు ఫోర్జరీ చేశాడు. ట్యాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి కూడా తప్పుడు పత్రాలు తయారుచేశాడు.
కోట్ల ఖర్చుతో విహారయాత్రలు..!
ఆ తప్పుడు డాక్యుమెంట్లతోనే అతను లోన్ కోసం దరఖాస్తులు పెట్టుకోగా.. మొత్తం 5 మిలియన్ డాలర్ల లోన్ వచ్చింది. అంటే మన కరెన్సీలో అది 36 కోట్ల 68 లక్షల రూపాయలు. అప్పనంగా అంత డబ్బు చేతికి అందడంతో ఖాద్రీ జల్సాల విషయంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విహార యాత్రలకు కోట్లు ఖర్చు చేశాడు. అంతేకాదు ఫెరారీ, బెంట్లీ, లాంబర్గిని లాంటి ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. అయితే, అతగాడి బండారం బయటపడటంతో పోలీసులకు చిక్కాడు.
తనది మోసం కాదంటున్న నిందితుడు
కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన చిరువ్యాపారులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను ఖాద్రీ తన మోసానికి వాడుకున్నట్లు గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు మిలియన్ డాలర్ల నగదును, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడిని లక్ష డాలర్ల పూచికత్తుపై బెయిల్‌పై విడుదల చేసింది. అయితే, ఇంత జరిగినా ఖాద్రీ మాత్రం తాను చేసింది తప్పే కాదంటున్నాడు. లోన్ తీసుకోవడం మోసం ఎలా అవుతుందని అతగాడు వాదిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దేశంలో ఇప్పటివరకు 30.56 కోట్ల కరోనా పరీక్షలు
కరోనా కల్లోలంలో బ్లాక్ ఫంగస్ బెడద
రోజువారీ కరోనా కేసుల్లో మహారాష్ట్రను వెనక్కి నెట్టిన కర్ణాటక
రెమ్డిసివిర్ కోసం కరోనా బాధిత కుటుంబాల అవస్థలు..!