చిక్కడపల్లి, మార్చి 4 : గాంధీనగర్లోని ఎల్లయ్య బస్తీలో మంగళవారం ఓ ఇంట్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో వృద్ధురాలిని కాపాడబోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ డివిజన్ ఎల్లయ్య బస్తీలో జబ్బార్ భార్య అమీనా (60)తో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో మంటలు చిలరేగాయి. ఆ సమయంలో అమీనా ఇంట్లో ఒక్కతే ఉన్నది. ఇల్లంతా పొగ నిండటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే భవనంలో పక్క ఇంట్లో అద్దెకుంటున్న రాజు వెంటనే స్పందించి.. సాహసం చేసి మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలని బయటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో రాజు కాళ్లకు గాయాలు కావడంతో ఇరువురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.. ఇరువురి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ముషీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ముఠా నరేశ్ ఘటనాస్థలిని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.