Hyderabad | హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో విషాదం నెలకొంది. జలమండలి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. కిశోర్ కుమార్ అలియాస్ చిన్నా మామ అరుణ్ నవోదయ కాలనీలోని జలమండలి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో మామతో కలిసి కిశోర్ అప్పుడప్పుడు జలమండలి కార్యాలయానికి వస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా మామ అరుణ్‌తో కలిసి కిశోర్ జలమండలి కార్యాలయానికి వచ్చాడు. అరుణ్ తన పనిలో నిమగ్నమై ఉండగా.. కిశోర్ వాటర్ ట్యాంకర్ రెండో అంతస్తుకు ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తూ కిశోర్ కిందపడటంతో అతని తలకు బలంగా గాయమై.. అక్కడికక్కడే మరణించాడు.
కాగా, మామిడి పండ్లు తెంపే క్రమంలో కిశోర్ కాలు జారి కింద పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.