బంజారాహిల్స్,ఆగస్టు 24: ‘అమ్మా.. నన్ను క్షమించు& నేను కోరుకున్న జీవితం ఇది కాదు..’ అంటూ తల్లికి లేఖ రాసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేబాశిష్(22) అనే యువకుడు ఇటీవల నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మంత్రి బిల్డర్స్ సైట్లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తూ అక్కడే సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు.
గత కొన్నాళ్లుగా ముభావంగా ఉన్న దేబాశిష్ శనివారం గదిలో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు దేబాశిష్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘ఎన్నో ఆశలతో ఇక్కడకు వచ్చాను.. నేను కోరుకున్న జీవితం ఇది కాదు అమ్మా.. నన్ను క్షమించు అమ్మా..’ అంటూ రాసిన లేఖ లభ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.