నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే
అంటూ.. తెలంగాణ వాసులందరూ నిత్యం కొలిచే ఇంటింటి ఇలవేల్పు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయం తిరిగి ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారిని అర్చకులు దివ్య మనోహరంగా అలంకరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ విష్ణు గణాలకు అధిపతి అయిన విశ్వక్సేనుడిని పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఆరాధించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 21: యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలంకరించిన స్వామివారిని అధిష్టింపజేశారు. స్వామివారికి నవ కలశాభిషేకం చేశారు. ఆలయం పునః ప్రారంభం అనంతరం తొలిసారిగా జరిగే బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, లోకాలకు శుభాలు కలుగాలని వేద మంత్రాలు పఠిస్తూ పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో విష్వక్సేనారాధన జరిపారు. ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వస్తివాచనం కార్యక్రమాన్ని ప్రధానార్చక బృందం నిర్వహించింది.
పుణ్యాహవాచనంలో భాగంగా శుద్ధ జలాలతో స్వామివారి ప్రధానాలయం, గర్భాలయం, ఆలయ మాఢవీధులు, ప్రాకార మండపాల్లో సంప్రోక్షణ చేశారు. రక్షా బంధనాలను ప్రత్యేక పాత్రలో ఉంచి విమల మొదలగు అష్టదళ శక్తి దేవతలను ఆవాహనం చేసి ధూపదీపాలను సమర్పిస్తూ రక్షా బంధనం వేడుకలను జరిపారు. అనంతరం స్వయంభూ నారసింహులకు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు, రామానుజాచార్యులు, విష్వక్సేనుడు, ఉత్సవ మూర్తులకు కంకణధారణ గావించారు. అనంతరం నిర్వాహక బృందం, భక్తులకు రక్షా బంధనాలను ధరింపజేశారు. రుత్విగ్వరణం, స్వామివారికి మంత్ర పుష్ప నీరాజన కార్యక్రమాలను పాంచరాత్రాగమ శాస్ర్తానుసారంగా ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఆలయ అర్చకులు, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ధ్వజస్తంభంపై నేడు దేవతాహ్వానం
యాదగిరిగుట్ట ఆలయం పునఃప్రారంభం అనంతరం తొలిసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానున్నది. ప్రధానాలయ ముఖ మండపంలో పూర్తిగా స్వర్ణంతో నిర్మించిన ధ్వజస్తంభంపై మహావిష్ణువుకు ఇష్టమైన వాహనం ధ్వజస్తంభ స్వరూపమైన గురుత్మండిని కొలుస్తూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకనున్నారు. అష్టదిక్పాలక బలిహరణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టనున్నారు. అప్పట్లో జరిగే బ్రహ్మోత్సవాలను ఇత్తడి ధ్వజస్తంభంపైనే ధ్వజారోహణం చేపట్టేవారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన అడవి నుంచి 35 ఫీట్ల నారవేప కర్రను ధ్వజస్తంభం కోసం తీసుకొచ్చారు. దీనికి 1,785 గ్రాముల బంగారంతో స్వర్ణ తాపడం చేశారు. బంగారు తాపడంపై పుష్పాలు, సింహాం, ఉప పీఠాల ఆకృతులను చెక్కారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో ఉన్న బలిపీఠానికి బంగారు వర్ణపు తొడుగులు బిగించారు. దీనికి 1,552 గ్రాముల బంగారం వినియోగించారు.
స్వామివారి ఆజ్ఞతో..
బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఉదయం 10.05 గంటలకు గర్భాలయంలో స్వయంభూ నరసింహ స్వామిని ఉత్సవాల నిర్వహణకు ఆజ్ఞ స్వీకరించారు. స్వామివారి రక్షాబంధనంతో వేదమంత్రోచ్ఛారణలు, డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు గర్భాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనుమతిని పొందారు.
రక్షాబంధనం
బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధన వేడుక విశిష్టమైనదని, సర్వకల్యాణ జనకం, సర్వశత్రు వినాశనం, ఆయురారోగ్య ప్రదాయకం, సంతానప్రదం మొదలగు ఎన్నో ఫలితాలు కలుగుతాయని ప్రధానార్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు భక్తకోటికి కల్పవృక్షాలై అనుగ్రహ సంపదను వివిధ ప్రక్రియల ద్వారా అందించనుందన్నారు. కంకణధారణ ధరించిన వ్యక్తికి భూత, ప్రేత, పిశాచాది రోగ బాధలు తొలగి సర్వావయవాలు శుచి కలిగి మనస్సు నిర్మలమై పరమాత్ముని చేర్చగలిగినదిగా ఉంటుందని చెప్పారు. ఒక పవిత్రమైన భావన ఏర్పడి భగవంతుడిని త్రికరణ శుద్ధిగా సేవించే యోగ్యత పొందేందుకు ఈ వేడుక నిర్వహిస్తారు.
స్వస్తివాచనం
బ్రహ్మోత్సవంలో భాగంగా లోకములన్నీ శుభపరంపరలు పొందాలని అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలు, సమస్త దివ్య సంపద కలిగిన దివ్య పురుషులను వేడుక ద్వారా ఆహ్వానించి ఆరాధన గావించారు. దేవతలకు మంత్రోచ్ఛారణల ద్వారా దివ్యశక్తి ఏర్పడుతుందని, దాంతో సమస్తలోకాలు శాంతిమయం కాగలవని ఈ స్వస్తివాచన వేడుక సూచిస్తున్నదని ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
అంకురారోపణం
అంకురం అనగా బీజం అని చీమ నుంచి బ్రహ్మ వరకు ఉండే హృదయాలను సూచిస్తుంది. పాలిక శరీరం అని, మృత్తిక పంచ భౌతికమైనదని, అందులో బీజం జీవాత్మ తత్వం అని, అది వికసించి పరమాత్మ అనుగ్రహం పొందుటయే ఆ పాలికలలో ధాన్యం పండుటయని శాస్త్రం చెబుతుందని అర్చక స్వాములు వివరించారు. పండిన ధాన్యాన్ని దర్శించిన కలుగు అనందమే పరమాత్మ స్వరూపం అని వేదాంతార్థం.
విశ్వక్సేనా రాధన
లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిగా చేసేది విశ్వక్సేనా రాధన. దీని ద్వారా సమస్త విఘ్నములు తొలగి సకల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అనంతమైన దివ్య తేజస్సులు సిద్ధిస్తాయి. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం అలయ అర్చకులు, యాజ్ఞీకులు, పారాయణీకులు విశ్వక్సేనుడికి ప్రత్యేక పూజలు చేశారు.
స్వామి, అమ్మవార్లకు రూ.20 లక్షల ఆభరణాలు
లక్ష్మీనరసింహ స్వామికి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సత్తూరు సుందరమ్మ రూ. 20 లక్షల బంగారం, డైమండ్‌తో కూడిన హారాలను బహూకరించారు. దశావతార హారం, లక్ష్మీదేవి హారం, ముత్యాలు, డైమండ్ హారాలను మంగళవారం ఆలయ ఈఓ ఎన్. గీతకు అందజేశారు. హారాలను ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవారికి అలంకరించారు.
నేడు ధ్వజారోహణం, భేరి పూజ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 11 గంటలకు అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం 6 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలు జరుగుతాయి.
పోచంపల్లి పట్టువస్ర్తాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి పూజల నిర్వహణ సమయంలో భూదాన్ పోచంపల్లికి చెందిన పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలను ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తికి అందజేశారు. ప్రతిఏటా పోచంపల్లికి చెందిన పద్మశాలీ మహాజన సంఘం వారు నియమ నిష్టలతో స్వామి, అమ్మవార్లకు స్వయంగా మగ్గంపై పట్టుతో తయారు చేసిన వస్ర్తాలను అందజేస్తారు. 30 రోజుల పాటు శ్రమించి అత్యద్భుతంగా తయారు చేశారు. స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసిన దోతి, కండువాకు జరి అంచుతో కూడిన పట్టు, అమ్మవారికి పటోళ్ల ఇక్కత్ పట్టు వాడారు. రావెల పువ్వు మీద ఆనంద రంగు, గులాబీ రంగు అంచు, చీరెలో శంకుచక్రాలు, అంచుల్లో కలశాలు, ఐరవతాలను తీర్చిదిద్దారు.
మృత్సం గ్రహణం
వరాహరూపంలో ఉన్న స్వామిని మృత్సంగ్రహణం కోసం ప్రార్థిస్తారు. మృత్తికపై భగవానుడిని చిత్రించి పాలికల్లో మృత్తిక, నవధాన్యాలు పోసి పూజలు చేశారు. పవిత్ర జలాలతో ఉత్సవాల చివరి వరకు ప్రతి రోజూ ఆరాధనలు గావిస్తారు. ఈ పాలికలలోని నవధాన్యాలు దినదినం వృద్ధి చెందుతాయని, లోకమంతా ఆహారధాన్యాల కొరత లేకుండా సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మిని పూజించడం ఈ వేడుకలోని ప్రత్యేకత అని అర్చకులు వెల్లడించారు.
సాయంత్రం మృత్సంగ్రహణం
బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం 6.30 గంటలకు మృత్సం గ్రహణం, అంకురారోపణ వేడుకలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకులు నిర్వహించారు. అంకురారోపణ కోసం ఆలయ అర్చక బృందం మంగళవాయిద్యాలతో వెళ్లి భూమాతను పూజించి పుట్టమన్ను స్వీకరించారు. మట్టిని కొత్త పాలికలో వేసి వాటిలో నవధాన్యాలు ఉంచి మంత్ర జపాలతో ప్రోక్షణ చేశారు. తొమ్మిది పాలికలలో మంత్రాలతో ఆవాహన గావించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వాహణాధికారి ఎన్. గీత, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, కిరణాచార్యులు, శ్రీధరాచార్యులు, యాజ్ఞీక సిబ్బంది, సహాయ కార్యనిర్వాహణాధికారులు గజవెల్లి రమేశ్‌బాబు, రఘుబాబు, ఆలయ అధికారులు ముద్దసాని నరేశ్, అశోక్ పాల్గొన్నారు.