యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయ నిర్మాణాలు పంచారాత్రగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఆలయం చుట్టూ ఉన్న 7 రాజగోపురాలకు గల ద్వారాలకు బంగారు వర్ణపు ఇత్తడి తొడుగుల, ఒక త్రితల రాజగోపురంతోపాటు ఉపాలయాలు, శంకు చక్రాలతోపాటు గరుత్మండి విగ్రహానికి వెండి కవచం పనులను జనగామ జిల్లా పెంబర్తికి చెందిన విశ్వకర్మ కో ఆపరేటివ్ సొసైటీవారికి అప్పగించగా పనులు సాగుతున్నాయి.
సుమారు 2,600 కేజీల ఇత్తడితో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం గల పంచతల రాజగోపురాలకు గల ద్వారాల దర్వాజలకు పద్మాలు, లతతోపాటు శంకు చక్రనామాలతో కూడిన ఇత్తడి తొడుగులు బిగించనున్నారు. ఇప్పటికే ప్రధానాలయానికి నిర్మించిన దక్షిణం, ఉత్తర బాగంలో గల దర్వాజలకు బిగింపు ప్రక్రియ పూర్తి కాగా, మిగతా తూర్పు, పడమర దర్వాజలకు పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో ద్వారం దర్వాజలకు 36 పద్మాలను అమర్చనున్నామని స్వర్ణకారులు తెలిపారు.
వీటితో పాటు 800 కేజీల వెండి తొడుగులను బిగించే పనులు త్వరలో ప్రారంభించనున్నారు. స్వామి గర్భాలయానికి వెళ్లే త్రితల రాజగోపురం ద్వారం దర్వాజలు, గర్భాలయంలోని 5 ఉపాలయాలు, శంకు చక్రాలు, గరుత్మండి విగ్రహానికి తొడుగులు చేపట్టనున్నారు. ఆలయంలోని మొత్తం 6 పంచతల, ఒక సప్తతల రాజగోపురాలకు గల ద్వారాల దర్వాజలకు ఇత్తడి తొడుగులు, ఒక త్రితల రాజగోపురానికి గల ద్వారం దర్వాజకు వెండి తొడుగులు బిగించనున్నారు.