శివ్వంపేట, ఆగస్టు 26: నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి. పాలిటెక్నిక్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 45 మంది విద్యార్థులు వసతి గృహంలో, మిగిలిన విద్యార్థులు బయట నుంచి వస్తుంటారు.
హాస్టల్ విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ అటాచ్డ్ హాస్టల్ కాకుండా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉండడంతో కూరగాయల కోసం ప్రతినెలా రూ. 2200 నుంచి 2400 వరకు ఖర్చులు అవుతున్నాయని విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. విద్యార్థులు నెలనెలా డబ్బులు కడుతున్నప్పటికీ నాణ్యమైన భోజనం పెట్టడం లేదు.
అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. సరైన ఆహారం అందక చదువుపై దృష్టిపెట్టలేక పోతున్నామని, హాస్టల్, కళాశాలకు ప్రహరీ లేదని, గేటు కూడా లేదని, హాస్టల్ ఎదుట విద్యుత్ స్తంభాలకు కు లైట్లు లేక రాత్రిళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.