సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠంగా 9.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సెంట్రల్ యూనివర్సిటీ, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలతోపాటు, నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు కురిశాయి. ఇక ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 33.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.3డిగ్రీలు, గాలిలో తేమ 45.6శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.