బంజారాహిల్స్,ఆగస్టు 26: ఏ కష్టమొచ్చినా నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చాడు.. అర్ధరాత్రి అయినా అత్యవసరంగా డబ్బులు కావాలంటే మీ తమ్ముడిలా ఆదుకుంటానంటూ నమ్మబలికాడు. కార్పొరేటర్ నుంచి సీఎం దాకా రాజకీయ నేతలతో ఫొటోలు దిగుతూ తన పరపతి మరో రేంజ్ అంటూ నటించాడు.. నమ్మకమే జీవితం అంటూ చిన్నప్పటినుంచి స్నేహితులుగా ఉన్నవారితో పాటు అనేక బస్తీలకు చెందిన నిరుపేదల నుంచి బంగారం తాకట్టు పెట్టుకోవడంతోపాటు అధికవడ్డీలు ఇస్తానంటూ లక్షలాది రూపాయలు తీసుకుని చేతులెత్తేశాడు. ఫిలింనగర్లో జ్యువెలరీ వ్యాపారి మాణిక్ చౌదరి మోసాలు భారీగా బయటకు వస్తున్నాయి.
ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్ బస్తీలో జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ పేరుతో మాణిక్ చౌదరి(45) సుమారు 20 ఏళ్లనుంచి వ్యాపారం చేస్తుంటాడు. ఫిలింనగర్ 18బస్తీల్లో స్థానికులతో స్నేహంగా ఉండడం, రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలకు విరాళాలు ఇవ్వడం తదితర చర్యల ద్వారా నమ్మకం చూరగొన్నాడు. దీంతో అతడి వద్ద బస్తీకి చెందిన వందలాదిమంది బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టారు.
కాగా గత ఆరు నెలలుగా మాణిక్ చౌదరి వ్యాపారం దివాళా తీయడంతో తెలిసిన వారి వద్ద నుంచి లక్షల్లో అప్పులు చేశాడు. దీంతోపాటు తన షాపులో తనఖా పెట్టిన బంగారాన్ని కాజేయడం ప్రారంభించాడు. తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన వారివద్ద నుంచి డబ్బులు తీసుకొని, లాకర్ నుంచి బంగారం తెచ్చి ఇస్తానని నమ్మించి బిచాణా ఎత్తేశాడు.
బాధితుల ఫిర్యాదులతో సోమవారం నాలుగు చీటింగ్ కేసులు నమోదవ్వగా మంగళవారం అనేకమంది బాధితులు ఫిలింనగర్‌లోని మాణిక్ చౌదరి షాపు వద్దకు వచ్చి లబోదిమోమన్నారు. తన భర్త ఆరోగ్యం బాగాలేక, చికిత్స కోసం ఆరునెలల క్రితం తాను తాకట్టుపెట్టిన ఐదు తులాల బంగారంతో ఉడాయించాడని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. నెలరోజుల క్రితం రెండుతులాల బంగారం పెట్టి రూ.40వేలు అప్పు తీసుకున్నానని, ఈరోజు వచ్చి చూస్తే షాపు మూసేసి ఉందని మరో మహిళ ఆందోళన చెందింది.
ఇలా మాణిక్ చౌదరి వద్ద సుమారు 150మంది దాకా బంగారం తాకట్టు పెట్టి మోసపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్నేహితులతో పాటు స్థానికుల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు చేసినట్లు తెలుస్తోంది. వారంతా ఇప్పటికే రాజస్థాన్‌లోని సొంతూరుకు వెళ్లి వాకబు చేయగా మాణిక్ చౌదరి అక్కడకు రాలేదని బాధితులు గుర్తించారు.
సీఎం రేవంత్‌రెడ్డితో సహా అన్ని పార్టీలకు చెందిన నాయకులను తరచూ కలవడంతోపాటు ఫొటోలు దిగి తనకు పెద్దస్థాయిలో పరిచయాలు ఉన్నట్లు నమ్మించాడని స్థానికులు వాపోయారు. తనవద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, ఎక్కువగా ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ మాణిక్ చౌదరి వారంరోజుల క్రితం కొంతమందిని బెదిరించినట్లు సమాచారం. మొత్తం మీద ఆభరణాల వ్యాపారం పేరుతో మాణిక్ చౌదరి చేసిన మోసాలు వెలుగులోకి వస్తుండడంతో జనంలో కలకలం చెలరేగింది.