ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి దరఖాస్తులు స్వీకరించారు. ఇండ్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి తమ అనుచరులకు మంజూరు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ రణధీవనగర్కు చెందిన పేదలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులుగా ఎంపిక చేసిన తర్వాత మీరు ఇండ్లు కట్టుకోవద్దంటూ అధికారులు అంటున్నారని 170 కాలనీవాసులు ఆవేదన వ్యకం చేశారు. అర్హులైన వారికి ఇండ్లు అందించాలని పలువురు కోరారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వార్డు కౌన్సిలర్లతోపాటు ఇందిరమ్మ కమిటీలతో సంబంధం లేకుండా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసలైన లబ్ధిదారులకు అందకుండా అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇష్టానుసారంగా ఇండ్లను అనర్హులకు కేటాయిస్తున్నారని మాజీ కౌన్సిలర్ అలాల అజయ్ అన్నారు. దీంతో గుడిసెల్లో ఉంటూ కూలీ పనులు చేసుకునే వారికి ఇండ్లు దక్కడం లేదన్నారు. అర్హులైన వారికి ఇండ్లు అందించాలన్నారు. మాజీ కౌన్సిలర్లు పవన్ నాయక్, సలీం, ఇమ్రాన్, దమ్మపాల్ ఉన్నారు.
అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇండ్లు కట్టుకోవద్దని అంటున్నారు. ఇండ్లు మంజూరు కావడంతో మేం నివాసమంటున్న గుడిసెలు తొలగించాం. ముగ్గు వేయమని అధికారులను సంప్రదిస్తే మీ స్థలాలకు డబుల్ పట్టాలు ఉన్నాయంటూ నిరాకరిస్తున్నారు. ఉన్న గుడిసెలు తొలగించడంతో ఉండేందుంకు ఇండ్లు లేకుండా పోయాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– 170 కాలనీవాసులు, ఆదిలాబాద్
ఆదిలాబాద్ పట్టణంలోని రణధీవనగర్ కాలనీలో 71 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. పేదలకు కాకుండా అనర్హులకు ఇండ్లను కేటాయించారు. మూడుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఏం లాభం. అక్రమాలపై చర్యలు తీసుకోనప్పుడు ప్రత్యేక కౌంటర్లు ఎందుకు. కౌంటర్లో సిబ్బందిని అడిగితే తమను ఏమి అడగొద్దు, ఫిర్యాదులు ఉన్నతాధికారులకు పంపించడమే మా బాధ్యత అంటున్నారు.
– కార్తీక్, రణధీవనగర్ (ఆదిలాబాద్)