‘ఇప్పటివరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర సరికొత్తగా ఉంటుంది. సమాజంలో జవాబుదారీతనం, బాధ్యతల గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు’ అని అన్నారు వశిష్ట. ఆయన ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్యరాజ్ ప్రధాన పాత్రధారి. మోహన్ శ్రీవత్స దర్శకుడు. ఈ నెల 29న విడుదలకానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వశిష్ట సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో తాను మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపిస్తానని, ఎన్నో కలలతో జీవితాన్ని సాగించే అతని ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ‘మైథలాజికల్ టచ్ ఉన్న బార్బరిక్ పాత్ర నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అతని శక్తిని ఈ తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాం.
ఇందులో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. బార్బరికుడితో కనెక్ట్ అవుతూ ప్రతీ క్యారెక్టర్ సాగుతుంది. నేడు సమాజంలో చోటుచేసుకునే సంఘటనలకు సమాధానం చెబుతూ సందేశాత్మకంగా ఈ సినిమా మెప్పిస్తుంది’ అన్నారు.