Drugs | హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు.. కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకున్నారు.
మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో మంగళవారం నాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రీమారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి.. పలు పబ్‌ల్లో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో సోమవారం డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న విక్రమ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితుల్లో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ కూడా ఉండటం గమనార్హం. వీరి నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల ఎండీఎంఏ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా తెలిసింది.