బొల్లారం, మే 30: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతోపాటు వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడుతాయని తెలిపారు.
10 నుంచి 18 ఏండ్ల వయసు కలిగిన విద్యార్థులు ఈ వర్క్‌షాపుల్లో పాల్గొనవచ్చని, ప్రతిరోజు ఉదయం 10 నుంచి 4 గంటల వరకు వర్క్‌షాపులు నిర్వహించబడుతాయన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా మట్టికుండల తయారీ, వృధా పదార్థాలతో వినూత్న వస్తువుల తయారీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టెర్రకోట నగలు తయారీ, అగ్ని వేయకుండా వంటకాల తయారీ, డ్రోన్ మేకింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించబడుతాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు రాష్ట్రపతి నిలయం వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 040-23560518 నంబర్లో సంప్రదించాలని కోరారు.