సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ రోడ్లను కొందరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.. సివరేజీ, పైపులైన్, కేబుల్స్ పనులంటూ రోడ్లను తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్ని చోట్ల మట్టిపోసి వెళ్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తుండడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది.
వాస్తవంగా రోడ్లను తవ్వాలంటే జీహెచ్ఎంసీ నుంచి తప్పనిసరిగా ఎన్వోసీ (నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా వాటికి అనుమతి తీసుకోవడం లేదు. కొన్ని చోట్ల రాత్రికి రాత్రే తవ్వి పనులు చేసి వదిలేస్తున్నారు. దీంతో ఆ రోడ్లపై వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ సీసీ, బీటీ రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులను వర్షాకాలానికి ముందే ఎండాకాలంలో పూర్తి చేస్తుంటుంది. కానీ నగరం నడి బొడ్డున ఉన్న నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని అహ్మద్ నగర్ డివిజన్లోని పోలీస్ మెస్ మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను పక్షం రోజుల ముందే ప్రారంభించారు. పాత రోడ్డును తొలగిస్తున్న పనులు.. ప్రస్తుతం చురుకుగా సాగుతున్నాయి.
పోలీస్ మెస్ నుంచి రాక్ చర్చి మీదుగా అహ్మద్ నగర్ వెళ్లే రోడ్డును పూర్తిగా తవ్వి వదిలేయడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా వయా చాచా నెహ్రూపారు మీదుగా మాసాబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలు ఫస్ట్ లాన్సర్ రోడ్డులో జామ్ అవుతున్నాయి. పైగా సరోజినీదేవి కంటి ఆస్పత్రి పకనే ఉన్న బస్టాపు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డు వాహనదారులకు మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నది.
తకువ ట్రాఫిక్ ఉండే రూట్ అంటూ ఏర్పాటు చేసిన బోర్డును నమ్ముకుని పంజాగుట్ట, బంజారాహిల్స్ వెళ్లే వాహనదారులు ఈ మార్గంలో వచ్చి ఓవైసీపురా క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్‌లో చికుకుంటున్నారు. రాక్ చర్చి నుంచి పోలీస్ మెస్ వెళ్లే దారి తవ్వి వదిలేయడంతో వాహనదారులు ఓవైసీపురా, ఎంజీనగర్ మీదుగా గార్డెన్ టవర్ వరకు చేరుకుని అకడి నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్, లక్డీకాపూల్ వైపు వెళ్తున్నారు. ఇదే తరహాలో రాంనగర్ రాజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా, చికడపల్లిలో సీవరేజీ పనులంటూ రోడ్డు తవ్వి వదిలేశారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ పూర్వ కమిషనర్ లోకేశ్ కుమార్ నివాసముండే బంజారాహిల్స్ రోడ్ నెం.10లో కూడా రోడ్డును తవ్వి వదిలేయడంతో వాహనదారుల ఇబ్బందులు వర్ణణాతీతం.
బంజారాహిల్స్ రోడ్ నం. 14 భాగ్యనగర్ స్టూడియో రోడ్డులో వీడీసీసీ రోడ్డును తవ్వి వరద నీటి కాలువ పనులు చేపట్టిన అధికారులు.. తవ్విన రహదారిపై మట్టి పోశారు. రెండు రోజులు కురిసిన వర్షానికి మట్టి కొట్టుకుపోయి గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. మింట్ కాంపౌండ్ నుంచి బడా గణేశ్ వైపు వెళ్లే రోడ్‌ను పూర్తిగా మూసివేసిన కారణంగా వాహనదారులు తీవ్ర ఇకట్లు ఎదురొంటున్నారు.
యాక్ట్ ఫైబర్ కేబుల్స్, అనధికారికంగా తాగు, మురుగునీటి పైపులైన్ కనెక్షన్లు తీసుకునే వారి పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ కొన్ని ఆంక్షలు విధించింది. అత్యవసరమైతే తప్ప రోడ్లను తవ్వకూడదని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల తవ్వకాలపై మరింత దృష్టి సారించి, పనులు పూర్తయిన తర్వాత రోడ్లను సరిగా వేయాలని, ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.