ఉస్మానియా యూనివర్సిటీ, బంజారాహిల్స్: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్రవేశించి నిరసనలకు, సమ్మెకు అనుమతి లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే యూనివర్సిటీలలో అధ్యాపక నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న అధ్యాపకులను విస్మరించి యూజీసీ పే స్కేల్ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకుల అక్రమ నిర్బంధ అరెస్టులను నిరసిస్తూ బుధవారం ‘చలో ఉస్మానియా’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరశురాం, డాక్టర్ వేల్పుల కుమార్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజయందర్ రెడ్డి, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని డా.అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డా.కే.అవినాశ్, ప్రధాన కార్యదర్శి డా.కిశోర్, డా.నర్సింహులు, డా.విజయ్, ఉమాదేవి పాల్గొన్నారు.