సిటీబ్యూరో: ఏడున్నర కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కీలక దశకు చేరుకున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల్లో 60 శాతం ఆస్తుల సేకరణపై పీటముడి పడింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న 200 ఆస్తులను నోటిఫై చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో… మిగిలిన 400 ఆస్తుల సేకరణ తలకు మించిన భారంగా మారనున్నది.
ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణకు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెట్రో అధికారులు భూసేకరణ నోటీసులు జారీ చేసేవారు. రోడ్డుకు ఇరువైపులా తొలి దశలో 200 ఆస్తులకు సంబంధించి డిక్లరేషన్ తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించగా… ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే రోడ్డు విస్తరణ వల్ల మొత్తం 1000కి పైగా ఆస్తులు నష్టపోతున్నాయని భూసేకరణ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఇప్పటివరకు గుర్తించిన మార్గంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 55 దర్గాలు, అషూర్ఖానాలతోపాటు, 13 శ్మశాన, చిల్లాలతోపాటుగా, 100కుపైగా మతపరమైన నిర్మాణాలను గుర్తించినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
వీటిని సేకరించేందుకు ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినా… భూసేకరణ ప్రక్రియపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉన్నది. మెట్రో వెళ్లే మార్గాన్ని 100 ఫీట్లకు మెట్రో స్టేషన్లు వచ్చే ప్రాంతాన్ని 120 ఫీట్లకు విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం దారుల్షిఫా నుంచి శాలిబండ జంక్షన్ వరకు 50-60 అడుగుల వెడల్పుతో, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 80 ఫీట్ల రోడ్డు అందుబాటులో ఉంది. దీంతో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సగటున 30-40 ఫీట్ల మేర రోడ్లను విస్తరించాల్సి ఉండటంతో భూసేకరణ ప్రక్రియ చిక్కు ప్రశ్నగా మారింది. రోడ్డుకు ఇరువైపులా 200 ఆస్తులను నోటిఫై చేస్తూ జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. కానీ మిగిలిన 400 ఆస్తులను ఎలా సేకరించాలనేది అధికారులకు ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.