మర్లకుంటతండా, మేడిపల్లి గ్రామాల ఫార్మా భూముల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు స్టే ఉన్న భూముల్లోకి రెవెన్యూ, టీజీఐఐజీ అధికారులు మంగళవారం అక్రమంగా రైతు పొలాల్లోకి జేసీబీలతో చొరబడ్డారు. పోలీసుల పహారా నడుమ జేసీబీలతో బలవంతంగా రైతుల పొలాల్లో కొనసాగుతున్న అధికారుల పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మర్లకుంటతండా, మేడిపల్లిలోని ఫార్మా భూముల్లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సైదులు, సునీల్‌కుమార్‌లతో పోలీస్ సిబ్బంది బందోబస్తు కల్పించారు.
– యాచారం, జూలై1
యాచారం మండలంలోని మర్లకుంటతండాలో 155, 288 సర్వే నంబర్లలో విస్లావత్ సరియా, విస్లావత్ నాన్యా, విస్లావత్ కడియా, విస్లావత్ జంగు తమ పట్టా భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసుకుంటున్న జొన్న, పత్తి పంటలను పోలీసు పహారా నడుమ రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు జేసీబీలతో దున్నుతుండగా రైతులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని మొండికేసి అడ్డుకున్నారు.
యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఆర్ఐ మురళీకృష్ణ దగ్గరుండి పంటలను ధ్వంసం చేయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యోమటోడ్చి కష్టపడి సాగు చేసుకున్న పంటలను కండ్లముందే నాశనం చేస్తుండటంతో అన్నదాతలు తట్టుకోలేకపోయారు. అధికారులు, పోలీసుల కాళ్లవేళ్లాపడి బతిమిలాడారు. బోరున విలపించారు. అయినప్పటికీ హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పోలీసులు గిరిజన రైతులపై వీరంగం చేశారు. రైతులను ముట్టడించి జేసీబీల వద్దకు రాకుండా అడ్డుకొని వారిపై దౌర్జన్యం చేశారు.
భూములు టీజీఐఐసీ పేరుపై ఉన్నాయని.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినప్పటికీ తమ ప్రాణం పోయినా సరే మా భూములను వదులుకోబోమని రైతులు మొండికేయగా.. రైతులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. రైతులు ససేమిరా అనడంతో అక్రమంగా వారిని బలవంతంగా అరెస్టు చేశారు. కండ్ల ముందే పంట నాశనమవుతుంటే చూసి తట్టుకోలేక మహిళా రైతులు జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. జేసీబీ అద్దాలు పగులగొట్టేందుకు ఓ మహిళా రైతు యత్నించింది.

అది గమనించిన మహిళా కానిస్టేబుల్ ఆమెను అడ్డుకొని అరెస్టు చేసేందుకు వెళ్లింది. దీంతో మహిళా రైతు సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయింది. రాయి తీసుకొని ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పై తిరగబడింది. తన దగ్గరికి వస్తే రాయితో కొడతానని పోలీసులను సైతం బెదిరించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా ప్రాణం కంటే మా భూమే మాకు ముఖ్యమని ఆ మహిళ తేల్చి చెప్పింది. దీంతో మహిళా కానిస్టేబుల్ జేసీబీని నిలిపేసి రైతును అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. దీంతో పోలీసులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోపక్క మండలంలోని మేడిపల్లి గ్రామంలోనూ రైతులకు పోలీసులు, అధికారుల మధ్య వాగ్వాదం నెలకొన్నది. అధికారులు ఆడాల శ్రీకాంత్ పొలంలో జేసీబీలతో పత్తి పంటను ధ్వంసం చేయడంతో రైతులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు జేసీబీలను అడ్డుకోవడంతో పోలీసులు రైతులను ఈడ్చుకెళ్లారు. అధికారులు రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని రైతులతోపాటు స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ముందుగా తమకు ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలివ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
కోర్టు స్టే ఆర్టర్ ఉన్న భూముల్లోకి కోర్టు అర్డర్‌ను ధిక్కరించి ఎలా వస్తారని రైతులు అధికారులను నిలదీశారు. పరిహారం తీసుకున్న ఫార్మా భూముల్లో పంటలు వేయొద్దని ముందే చెప్పామని.. అయినా ఎందుకేశారని తహసీల్దార్ అయ్యప్ప ప్రశ్నించారు. తాము మా భూములను ఫార్మాసిటీకి ఇవ్వలేదని.. మాకు ఫార్మాసిటీ, ఫ్యూచర్‌సిటీ వద్దని, ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వాలని రైతులు సమాధానమిచ్చారు. బలవంతంగా రైతుల భూముల్లోకి వచ్చి రైతులను బెదిరించి భూములను స్వాదీనం చేసుకుంటే ఊరుకునేదిలేదని, ఎంతటికైనా తెగిస్తామని, ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని అధికారులను హెచ్చరించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ గుండాగిరి ప్రభుత్వం కొనసాగుతున్నదని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యురాలు కవుల సరస్వతి పేర్కొన్నారు. రైతుల పంటలను అధికారులు ధ్వంసం చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బాధిత రైతుల తరపున పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.