సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన దరిమిలా ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి)లో పూర్తి స్థాయిలో నేటి నుంచి స్వయం పాలన మొదలు కానున్నది. ఇప్పటివరకు మూడు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మూడు చోట్ల వేర్వేరుగా పాలన జరిగినప్పటికీ , ఆర్థికపరంగా అన్ని బాధ్యతలు జీహెచ్ఎంసీనే చూస్తూ వచ్చింది. గత ఏడాది నవంబరు 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీన ఆదేశాలు, ఆ తర్వాత హడావుడిగా విలీనం, అనంతరం ఫిబ్రవరి 11న మూడు కార్పొరేషన్ల ఏర్పాటు భౌగోళికంగా జరిగిపోయినా..అప్పులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు మార్చి నెలాఖరవరకు జీహెచ్ఎంసీ నుంచే జరిగాయి.
ఐతే కొత్తగా ఏర్పడిన సీఎంసీ (సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్), ఎంఎంసీ (మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్)లకు కొత్త బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కీలకమైన రెవెన్యూ, ఫైనాన్స్ విభాగాల విభజన కూడా దాదాపు పూర్తిచేశారు. దీంతో మార్చి 31న అర్ధరాత్రి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించిన ఫీజులు ఆయా కార్పొరేషన్ల ఖాతాల్లోనే జమకానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సాఫ్ట్వేర్ మార్పులు, బ్యాంక్ ఖాతాల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. అప్పుల విభజన అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున, మిగిలిన అన్ని బాధ్యతలు కొత్త కార్పొరేషన్లు స్వయంగా నిర్వహించుకునేలా పనులు చేపట్టారు.
ప్రతీ కార్పొరేషన్‌కు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ..
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆయా కార్పొరేషన్లు ఎవరి లెక్కలు వారివే అన్నట్లుగా పనిచేయనున్నాయి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు వేర్వేరుగా నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఇకపై ప్రతి కార్పొరేషన్‌కు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ అమల్లోకి రానున్నది. హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా విడిగా నిర్వహించబడనున్నది. ఆదాయం, ఖర్చులు సంబంధిత కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయి. ఎవరి అకౌంట్స్ , ఆదాయం, ఖర్చులు ఎవరి వారివే.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఇప్పటికే తమ తమ పరిధుల్లో పూర్తిస్థాయి పరిపాలన బాధ్యతలు చేపడుతున్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా పూర్తి స్వతంత్రంతో వ్యవహరించనున్నాయి. కాగా ప్రాజెక్టులకు సంబంధించి 3 కార్పొరేషన్ల క్యూర్ పరిధిలోని మొత్తం 7.80 లక్షల పైచిలుకు వీధి లైట్ల నిర్వహణ బాధ్యత మాత్రం జీహెచ్ఎంసీ నిర్వర్తించనుంది. వీటి నిర్వహణ బాధ్యతలను పదేళ్ల గడువుతో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనుండడం, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మెయింటనెన్స్ బాధ్యతను జీహెచ్ఎంసీనే తనకున్న అనుభవంతో టెండర్ ప్రక్రియ, నిర్వహణను కొనసాగించనుంది. ఎస్ఆర్డీపీ, హెచ్ సిటీ ప్రాజెక్టు, నాలా అభివృద్ధి , సీఆర్ఎంసీ పనులను ఆయా కార్పొరేషన్లకు అప్పగించనున్నారు.
అప్పుల భారంపై రాని స్పష్టత..
జీహెచ్ఎంసీకి ఉన్న అప్పుల విభజన అంశం సర్కారు నిర్ణయంపై ఆధారపడి ఉంది. గతంలో వివిధ ప్రాజెక్టుల కోసం బల్దియా తీసుకున్న రూ.6,530 కోట్లలో రూ. 4,876 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ అప్పులను ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు చెప్తున్నప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే అప్పుల భారం ఎలా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు జీహెచ్ఎంసీ నుంచే కిస్తీలు చెల్లిస్తారా? ఈ నెలలో చెల్లించాల్సిన రూ.110 కోట్ల మాటేంటి తదితర విషయాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.