మా నాయన ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఈ జాగ చూపించింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ జాగలో కంపలు ఉంటే తీసేసి ఇక్కడకే వచ్చినం. కాంగ్రెస్‌కు ఓటేస్తే మాకు మంచిగనే బుద్ధి చెప్పిండ్రు. పిల్లగాళ్లు పెళ్లికి ఎదిగి ఉన్నరు. ఇప్పుడొచ్చి మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని బయటకు పంపుతున్నరు. ఓ ఎల్లమ్మ తల్లి.. ఎక్కడున్నవ్ అమ్మా. మా బాధలు చూడు. రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పు తల్లీ అంటూ ఓ వృద్ధురాలి శాపనార్థాలు.
ఆరు పథకాలు అన్నడు. ఏ పథకం మాకు ఇయ్యనేలేదు. మా భూములు తీసుకుంటుండు. కోర్టు మావే అని చెప్పినా మా నుంచి గుంజుకుంటున్నడు.. తెల్లారుజామున నాలుగు గంటలకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలన్నరు. ఎందుకంటే పోలీసోళ్లు, హైడ్రా కలిసి మమ్మల్ని బలవంతంగా బయటకు పంపి సామాను బయటపడేసి ఇల్లు కూలగొట్టిండ్రు. చిన్నచిన్నపిల్లలతో ఎక్కడికని పోవాలె. మేము సర్కారుకు కాలువ కోసం ఇచ్చిన కాలువలోనే పడి సచ్చిపోతం. మాకే పథకాలు వద్దు. మా భూములు మాకు కావాలి.. బాధిత మహిళల ఆవేదన.
సిటీబ్యూరో/మాదాపూర్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): మా మామలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్లకు అప్పట్లో ఇందిరమ్మ భూములు ఇచ్చింది. ఇది అయి అరవై డబ్బు ఏళ్లయింది. ఇంతకాలం మా జోలికి ఎవరూ రాలే. ఇప్పుడేమో ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పుకొని ఆమె ఇచ్చిన భూములను గుంజుకుంటున్నరు. పండుగ తెల్లారే ఇక్కడకు వచ్చి మాకు ఆ సంబురమే లేకుండా చేసిండ్రు..ఇదేం పాలన. ఇదేం పద్ధతంటూ ఓ మహిళ ఆగ్రహం..
శనివారం తెల్లతెల్లవారకముందే కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తెల్లవారుజామున నాలుగుగంటలకే కొండాపూర్‌కు చేరుకున్న హైడ్రాబుల్డోజర్లు, ప్రొక్లెయినర్లు భిక్షపతినగర్లో ఉన్న ఇళ్లను తొలగించే క్రమంలో బాధితుల రోదనలు మిన్నంటాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లలో ఉన్నవారిని ఉన్నట్టుగానే బయటకు పంపి వారి సామాగ్రిని బయటపడేసి ఇళ్లు నేలమట్టం చేసింది. కూల్చివేతల సమయంలో మీడియాను కానీ, స్థానికులను కానీ కనీసం రెండుకిలోమీటర్ల వరకు రానీయకుండా పోలీసులు, హైడ్రా సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క నోటీసు అయినా ఇవ్వకుండా పండుగ తెల్లారే ఆ సంబురం లేకుండా ఇండ్లన్నీ కూల్చేయడంతో వారంతా ఏడుస్తూ ఇప్పుడు తమకెవరు దిక్కని, ఎక్కడికని పోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. కొండాపూర్ భిక్షపతి నగర్‌లోని సర్వే నంబర్ 59 లో 36 ఎకరాల పట్టా భూముల్లో గత 60 ఏండ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో ఇండ్లు కోల్పోయిన బాధితులు శిథిలాల మధ్య కూర్చుని తమను వంట కూడా చేసుకోనీయకుండా, కనీసం పిల్లలకు పెట్టుకోనీయకుండా వెళ్లగొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడుగడుగునా నిరసనలు
హైడ్రా కూల్చివేతల పర్వంలో అడుగడుగునా నిరసనలే వ్యక్తమవుతున్నాయి. తాము ముందస్తుగా గుణపాఠాలు నేర్చుకుని కూల్చివేతలకు వెళ్తున్నామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వేదికల ద్వారా చెబుతున్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారకముందే కూల్చివేతలకు దిగుతున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. శనివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతి నగర్ సర్వేనంబర్ 59లో ఉన్న గుడిసెలను హైడ్రా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చేసింది.
గతంలో జిల్లా కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తాజాగా హైకోర్టు ఇది ప్రభుత్వ స్థలమేనంటూ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి.. హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే తమకు కోర్టుకు వెళ్లే అవకాశమే ఇవ్వకుండా శని, ఆదివారాల్లో కూల్చివేతలే చేపట్టవద్దంటూ హైకోర్టే స్వయంగా హెచ్చరించినా.. హైడ్రా మాత్రం పండుగ దినాల్లోనే పేదలకు పండుగ సంబురాలు లేకుండా చేస్తోంది. శనివారమే కూల్చివేతలకు పాల్పడి వారెవరూ న్యాయస్థానాలకు వెళ్లేందుకు అనుకూలమైన సమయం ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు నోటీసులివ్వకుండానే కూల్చివేతలు చేపట్టిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేదల జోలికి రాని కేసీఆర్ ..
కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదని బాధిత మహిళలు చెబుతున్నారు. నోరు తెరిచి అడగకున్న పేదల కోసం ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని..అవసరమైతే సాయమే చేశారు కాని పేద ప్రజలను ఇబ్బందులు పెట్టలేదని వారు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చి మాకు కష్టం తెచ్చిందంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. మళ్లీ కేసీఆరే రావాలని బాధిత మహిళలు వాపోయారు. రేవంత్‌రెడ్డి పేద ప్రజలపై తన ప్రతాపం చూపుతున్నాడని, బడాబాబులు కబ్జాలు చేసినవి రేవంత్‌రెడ్డి కంటికి కనిపించవా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రెండేండ్లు కూడా కాకముందే పేదలను హైడ్రా పేరుతో రోడ్డున పడేస్తున్నాడని, అదే కేసీఆర్ తన పదేండ్లలో ఒక్కరోజు కూడా తమ జోలికి రాలేదని వారు చెప్పారు.
కుటుంబ నియంత్రణ చేసుకున్నందుకు..!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఈ భూములు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఇచ్చిన పత్రాలను కూడా చూపిస్తున్నారు. అయితే వారెవరికీ చదువు రాకపోవడంతో వారికి సంబంధించి పత్రాలపై అప్పటి ఎమ్మార్వో చేసిన చిన్న పొరపాటు ప్రస్తుతం వారికి తలనొప్పిగా మారిందని స్థానికులు చెప్పారు. అయితే ఈ భూమి విషయంలో తమ తాతలు, తండ్రుల నాటి నుంచి ఇక్కడే ఉన్నారని, ఈ భూమిని చదును చేసుకుని, ఇక్కడి చెలిమలో నీళ్లు తాగి బాగు చేసుకుంటే దీనిపైకన్నేసి గుంజుకోవాలని చూస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇందిరా గాంధీ హయాంలో పేదలకు ఇచ్చిన పట్టా భూముల విషయంలో ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. గత 60 ఏండ్లుగా నివాసం ఉంటున్న మమ్ములను అక్కడి నుంచి ఎలాగైనా ఖాళీ చేయించలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఖాళీ చేయించే కుట్ర చేస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రభుత్వం పట్టాలను ఇచ్చిందంటున్నారు. ఇందులో 12 మంది దళితుల కుటుంబాలు నివాసాలు ఏర్పరుచుకొని జీవనం సాగిస్తున్నారు.
గతంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ భూములు యజమానులవేనని నిర్థారిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని బాధితులు చెప్పారు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి భూములు ప్రభుత్వానికి చెందినవంటూ న్యాయపోరాటం చేసింది. ఇటీవల హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనంటూ తీర్పునిచ్చిందని దీంతో అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఖాళీ చేయించడానికి రెవెన్యూ, హైడ్రా, పోలీసు బలగాలతో కొండాపూర్‌కు చేరుకుని తెల్లవారకముందే వారిని ఖాళీ చేయించి సామాన్లు బయటపడేసి ఇండ్లు కూలగొట్టారు. వారంతా శిథిలాలమధ్య ఉండి తాము ఇక్కడే ఉంటాం తప్ప ఎక్కడికీ పోయేదిలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలం ప్రభుత్వానిదేనంటూ తీర్పు వచ్చిందంటున్న అధికారులు..అక్కడ భూమికి సంబంధించినహద్దులునిర్ధారించకుండానే స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు పైపులను ఏర్పాటు చేశారు.
భూ భారతిలో సర్వే నంబర్ ఎక్కడ..!
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో సర్వేనంబర్ 59కు సంబంధించి భూ భారతిలో పరిశీలిస్తే ఆ సర్వే నంబర్ కనిపించడం లేదు. మరోవైపు నిషేధిత జాబితా కూడా ఓపెన్ కాకపోవడంతో ఈ సర్వే నంబర్ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నదంటూ స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో భూభారతిలో సదరు సర్వే నంబర్ కనిపించకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయన కొడుకు, రాష్ట్రముఖ్యనేత దగ్గర కుదిరిన డీల్‌తోనే తమను ఖాళీ చేయించి ఇక్కడ పాగా వేయడానికి హైడ్రాను అడ్డం పెట్టుకుని కోర్టు లేని రోజుల్లో ఇలా చేస్తున్నారంటూ వారు అన్నారు.
60 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం
నాలుగు తరాలుగా ఇక్కడే నివాసాలు ఉంటున్నాం. ఇందిరా గాంధీ హయాంలో పట్టా భూములను ఇచ్చారు. మా భూములకు చెందిన సరైన పత్రాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు మాపై చెప్పపెట్టకుండా నోటీసులు ఇవ్వకుండానే మా గుడిసెలను కూల్చివేశారు. ఎందుకు అని అడిగితే కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజర్తో తొలగించారు. ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి ఉన్నాం. 60 ఏండ్లుగా లేని ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వం పేదల భూములను అన్యాయంగా లాక్కోవడం అన్యాయం.
– లక్ష్మి, స్థానికురాలు
మా భూములు మాకు కావాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పేదలపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నది. ఉన్నోళ్లకు ఓ న్యాయం.. మాలాంటి పేదలకు ఓ న్యాయమా.. మా భూములు మాకు కావాలి. మా లాంటి పేద వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైనది కాదు. గుడిసెలో ఉన్న సామాన్లు తీసుకొనివ్వకపోవడంతో అంతా ధ్వంసమయ్యాయి. పిల్లలు ఆకలితో ఉన్నారు. వారికేదైనా వండి ఇద్దామన్నా చేయలేని పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం మా భూముల జోలికి రాకుండా మా బతుకులు మమ్ములను బతకనివ్వాలి.
-మంగమ్మ, స్థానికురాలు
పండుగ సంబురం లేకుండా చేసిండు
కూలీ పనిచేసుకుని బతికేటోళ్లం. పండుగై ఒక్కరోజుకూడా కాలే. అప్పుడే మాకు ఆ సంబురం లేకుండా చేసిండు రేవంత్‌రెడ్డి. తెల్లారుజామున నాలుగుగంటలకే హైడ్రావోళ్లు వచ్చిండ్రు. అందరినీ బయటకు పంపి సామాను బయటపడేసి పిల్లాజెల్లాతో సహా ఖాళీ చేయించి మా ఇళ్లు కూలగొట్టిండ్రు. మా ఇండ్లు తీసుకోవడానికి ఆయనకేం హక్కుంది. ఇది ఇందిరమ్మ ఇచ్చింది. అప్పుడే సర్కారోల్లు మా భూమి అని తేల్చిండ్రు. మళ్లీ ఇప్పుడొచ్చి వాళ్ల భూమి అని బయటకు పంపితే ఎక్కడకు పోవాలె.
– తొంట సక్కుబాయి, స్థానికురాలు