CM Revanth reddy | ఖైరతాబాద్ : మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తున్న అధికారులు అదే పరిధిలో ఉన్న ఇమ్లిబన్ బస్ డిపో, మెట్రో స్టేషన్లను కూల్చివేస్తారా? అని నివాస హక్కుల ప్రచార పరిరక్షణ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్ వర్గీస్ థేక్నాథ్, మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్‌కుమార్‌తో కలిసి మాట్లాడుతూ..
మూసీ పరీవాహక ప్రాంతాల్లో 90 శాతం పేదలే నివసిస్తున్నారని, ఎలాంటి పునరావాసం కల్పించకుండా కూల్చివేస్తే వారి అస్తిత్వానికి భంగం కలుగుతుందన్నారు. మలక్‌పేట్‌లోని జీహెచ్ఎంసీ లారీ స్టాండ్, ఉప్పల్ భగాయత్‌లోని ప్రభుత్వ భూమి పునరావాసానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ కోసమని చెబుతున్న ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరించిందా? అని ప్రశ్నించారు.
మూసీ పరీవాహకంలో ఉన్న నార్సింగి ప్రాంతంలో అనేక విల్లాలు, భవనాలు ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చడం లేదని ధ్వజమెత్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల తరపున నివాస హక్కుల ప్రచార పరిరక్షణ సంస్థ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు సంధ్య, కె. సజయ, సంగమిత్ర, బిలాల్, లింగయ్య పాల్గొన్నారు.