Hyderabad | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 22: తనకు ఇష్టం లేకుండా కూతురికి పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నిస్తున్నాడని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. మద్యం మత్తులో ఉన్న భర్తకు కరెంటు షాక్ పెట్టి.. గొంతు, మర్మాంగాలు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అనంతరం శవాన్ని పూడ్చిపెట్టి, తన భర్త కనిపించడం లేదంటూ దొంగ నాటకాలు మొదలుపెట్టింది. చివరకు ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఆమె చేసిన నేరం బయటపడింది.
కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, కేపీహెచ్‌బీ కాలనీ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన బోయిని సాయిలు (45) కవిత దంపతుల మధ్య పెళ్లయిన కొద్దిరోజుల నుంచే మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ విభేదాలు ఎక్కువ కావడంతో 14 ఏండ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. వారికి ఉన్న ఇద్దరు పిల్లల ( ఒక కూతురు, ఒక కొడుకు)తో కలిసి సాయిలు సొంతూళ్లేనే ఉంటున్నాడు. కవిత హైదరాబాద్ నగరంలో ఉంటూ చెడు తిరుగులకు అలవాటుపడింది. కాగా, సాయిలు తన కూతురి వివాహాన్ని అక్క కొడుకుతో చేయాలని నిర్ణయించాడు. అయితే కవిత మాత్రం అందుకు నిరాకరించింది.
భర్తకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో సాయిలును చంపేయాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన ఊరికెళ్లి సాయిలు పనిచేస్తున్న చోట రూ.20వేల అప్పు కూడా చెల్లించింది. కూతురి పెళ్లి కోసం డబ్బులు బాగా సంపాదిద్దామని భర్తకు నచ్చజెప్పి తన వెంట సాయిలును కవిత హైదరాబాద్‌కు వెళ్దామని చెప్పింది. కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్‌లో గుడిసెలో నివసిస్తున్న చెల్లెలు జ్యోతి, మరిది మల్లేశ్‌ల వద్దకు సాయిలును తీసుకొచ్చింది. ముందస్తు పథకం ప్రకారం ఈ నెల 19వ తేదీ రాత్రి సాయిలుకు బాగా కల్లు తాగించింది. సాయిలు మత్తులోకి వెళ్లగానే జ్యోతి, మల్లేశ్‌లతో కలిసి కవిత అతనికి కరెంట్ షాక్ పెట్టింది. అప్పటికీ సాయిలు కొనఊపిరితో ఉన్నాడని భావించి అతని గొంతు, మర్మాంగాలు పిసికి హత్య చేశారు. అనంతరం శవాన్ని ఓ కవర్లో మూటగట్టి, ఓ ఆటోలో సంగారెడ్డి సమీపంలోని చెరువులో వేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చి ఆ మూట ఏంటని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెబుతుండటంతో వారు చేస్తున్న పనికి నేను సహకరించనని ఆటో డ్రైవర్ వల్లి నాయక్ కరాఖండీగా చెప్పేశాడు. వారికి ఎక్కించుకున్న చోటే దించి వెళ్లిపోయాడు. దీంతో అదే రోజు రాత్రి సమీపంలోని ఓ నిర్మాణ ప్రదేశంలో గుంతలో శవాన్ని పూడ్చిపెట్టారు.
భార్య ఊరికి వెళ్లి నాటకం
భర్త సాయిలును చంపి పూడ్చిపెట్టిన తర్వాత కవిత మళ్లీ సొంతూరికి వెళ్లింది. తన భర్త పని కోసం వెళ్లి తిరిగి రాలేదని నాటకం ఆడటం మొదలుపెట్టింది. దీనిపై అత్త, కొడుకు, కూతురు ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారికి అనుమానం మొదలైంది. మరోవైపు ఆటో డ్రైవర్ ఉదయాన్నే కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతి-మల్లేశ్‌ల ఇంటికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఊరికి వెళ్లిన కవితను తీసుకొచ్చి విచారించగా, వారు ముగ్గురు కలిసి పథక ప్రకారం సాయిలును హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.