కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా పేదరికమే అర్హతగా డబుల్ ఇండ్ల కేటాయింపులు జరిగినట్లు విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. నిరుపేదల కండ్లలో సీఎం కేసీఆర్ డబుల్ ఆనందాన్ని నింపారని, లబ్ధిదారుల సంతోషానికి అవధుల్లేవన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మూడు విడతలుగా నిర్వహించిన డబుల్ ఇండ్ల కేటాయింపునకు డ్రా ద్వారా ఎంపికైన 2816 లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నిర్వహించారు.
ఈ సమ్మేళనంలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్‌రావు, శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డిలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ… నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిన ఏకైక సమర్థత కలిగిన పాలకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. నానాటికీ పెరుగుతున్న స్థలాల ధరల నేపథ్యంలో నిరుపేదలకు భారంగా మారిన సొంతింటి కలను సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా నిజం చేశారని విప్ గాంధీ పేర్కొన్నారు.
– మియాపూర్, సెప్టెంబర్ 29