Sabitha Indra Reddy | బడంగ్‌పేట, మే 15: హైదరాబాద్‌లోని మహేశ్వరం మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు వస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చింపివేయడం వివాదస్పదంగా మారింది. కాంగ్రెస్ నాయకులు నేరుగా సమావేశం మందిరం దగ్గరకు వచ్చి ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు బయట పెట్టుకుంటే అభ్యంతరం ఏముంటుందని అధికారులు వారికి సమాధానం చెప్పారు. అవసరమైతే మీరు కూడా బయట ప్లెక్సీలు పెట్టుకోవాలని సమాధానమిచ్చారు. అయినా వినకుండా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ప్రొటోకాల్ ప్రకారం సమావేశం నిర్వహించడం లేదని తప్పుగా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే వస్తుంటే రోడ్లపై స్థానిక నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నాయకులకు కండ్ల మంట ఎక్కువైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సమావేశం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాలు కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చింపివేసి కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాలు ఎలా కడతారని మండిపడ్డారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అధికార మదంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుర్మార్గాలపై మహేశ్వరం పోలీస్ స్టేషన్లో సింగిల్ విండో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులకు సబితా ఇంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు కట్టుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు చింపాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లను స్టేజ్ మీద కూర్చోపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్లకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం స్టేజిపైకి పిలవాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ ఏదైనా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుకనే పిలవడం జరిగిందని చెప్పారు. ప్రొటో కాల్ గురించి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏ హోదాలో నిత్యం సోషల్ మీడియాలో మీ నాయకుడు ఏం చెబుతున్నాడో వినాలని చెప్పారు. అందరూ సమావేశాల్లోకి పొమ్మని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. మొదలు మీ నాయకులకు ప్రొటోకాల్ గురించి నేర్పించాలన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచించాలి తప్ప చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.