Dasoju shravan kumar | ఢిల్లీ సార్వభౌమాధికార నినాదాలు వర్సెస్ హైదరాబాద్ రోడ్డు నాటకాలు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి..? రేవంత్ కాంగ్రెస్ జాతీయ సిద్ధాంతాన్ని విస్మరించి ప్రైవేట్ ఫ్రాంచైజీ రాజకీయాన్ని తెరపైకి తెచ్చిందా.. ? అని దాసోజ్ శ్రవణ్ ప్రశ్నించారు.
గౌరవనీయులైన రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు నేను ఈ లేఖను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాయడం లేదు. జాతీయ స్థాయిలో మీరు వాదించే అంశాలకు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఏఐసీసీ (AICC) నమ్ముతామని చెప్తున్న సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ప్రైవేట్ ఫ్రాంచైజీ-రాజకీయాలను బట్టబయలు చేయడానికే ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో అత్యంత పురాతనమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రవచించే సిద్ధాంతాలకు, తెలంగాణలో ఆ పార్టీ ప్రాంతీయ స్థాయిలో ప్రదర్శిస్తున్న రాజకీయ నాటకాలకు మధ్య తీవ్రమైన ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. న్యూఢిల్లీలోని మీ కేంద్ర నాయకత్వానికి, హైదరాబాద్‌లోని మీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న ఈ సంపూర్ణ సమన్వయ లోపం సాధారణ పౌరులను అయోమయంలో పడేస్తోంది : అసలు కాంగ్రెస్ పార్టీకి ఒకే విధమైన నిర్దిష్ట సిద్ధాంతం ఉందా, లేక ఏఐసీసీ లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నియంత్రణను దాటి, కేవలం రాజకీయ అవకాశవాదాన్ని నెరవేర్చడానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన విలువలను వాడుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
మోదీ చేష్టలను పదేపదే అవహేళన చేయడం..
మోదీ-ట్రంప్ విధానం సార్వభౌమాధికార లొంగుబాటంటూ ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం.. ఈ లేఖ క్రింద జతపరచబడిన అధికారిక ఏఐసీసీ ప్రకటన ప్రకారం, జూన్ 20, 2026న పవన్ ఖేరా ద్వారా జాతీయ కాంగ్రెస్ విభాగం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గత 12 ఏళ్లలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం “ఇండియా ఫస్ట్” (భారతదేశానికే మొదటి ప్రాధాన్యం) కాకుండా వినాశకరంగా “పీఆర్ ఫస్ట్” (ప్రచారం కోసమే) అన్నట్లుగా సాగిందని ఖేరా స్పష్టంగా ఆరోపించారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన విషయాల్లో అమెరికాను ప్రసన్నం చేసుకోవడం కోసం మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం, జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టడం, మోకరిల్లడమే ప్రధాని మోదీ విదేశాంగ విధానం సారాంశమని, డొనాల్డ్ ట్రంప్ మోదీ చేష్టలను పదేపదే అవహేళన చేయడం కేవలం ఆయన వ్యక్తిగత అవమానం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.
ప్రతీ భారతీయుడు తప్పక గమనించాల్సిన కొన్ని అత్యంత నిర్దిష్టమైన, తీవ్రమైన జాతీయ ఫిర్యాదులను ఏఐసీసీ ఆ ప్రకటనలో పొందుపరిచింది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారతదేశాన్ని చిన్నచూపు చూస్తూ, పదేపదే అవమానిస్తూ, “భాగస్వామ్య భాషలో కాకుండా ఆదేశాల భాషలో” మాట్లాడుతోందని ఏఐసీసీ జాతీయ ప్రతినిధి శ్రీ పవన్ ఖేరా మీ పార్టీ వైఖరిని చాలా స్పష్టంగా ప్రకటించారు. కానీ హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి గ్రౌండ్ యాక్షన్స్ (క్షేత్రస్థాయి పనులు) ఏఐసీసీ యొక్క అధికారిక విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.
ఏఐసీసీ వైఖరిని ధిక్కరిస్తూ డొనాల్డ్ ట్రంప్ కోసం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ రోడ్డు నాటకాలు కానీ, ఈ ప్రకటన వచ్చిన కేవలం మూడు రోజులకే, జూన్ 23, 2026 న, తెలంగాణలోని మీ స్వంత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేయడానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో, యూఎస్ కాన్సులేట్ పక్కనే, కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం “డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ”ను అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాజకీయ ద్వంద్వ నీతిని (Hypocrisy) మీరు ఎలా సమర్థిస్తారు.. ? అంటూ సుదీర్ఘ అంశాలను లేఖలో ప్రస్తావించారు.
ఢిల్లీలో సార్వభౌమాధికార నినాదాలు.. హైదరాబాద్‌లో రోడ్డు నాటకాలు @RahulGandhi గారి కి బహిరంగ లేఖ!
రెండు గుర్రాల స్వారీ చేస్తున్న కాంగ్రెస్.. ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి?
ట్రంప్ పర్యటనపై @INCIndia విమర్శలు నిజమైతే.. హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ ఎలా వేస్తారు?… pic.twitter.com/3mUWahWYjG
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) June 22, 2026