Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, సమంత నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో రోజు దాదాపు రూ.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి.
దీంతో కేవలం రెండు రోజుల్లోనే ‘మా ఇంటి బంగారం’ రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుని సమంత కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. తొలి రోజు రూ.5.35 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు మరింత జోరు చూపించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రెండో రోజు రూ.7.50 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.దీంతో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.12.85 కోట్ల నెట్, దాదాపు రూ.14.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘మా ఇంటి బంగారం’ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా బలమైన వసూళ్లు సాధిస్తోంది. ఆదివారం నాటికి 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జరిగితే సమంత కెరీర్లో మరో అరుదైన రికార్డు నమోదు కానుంది. ఇప్పటికే అమెరికా బాక్సాఫీస్ వద్ద 16 వన్ మిలియన్ డాలర్ సినిమాలతో అత్యధిక చిత్రాలు కలిగిన దక్షిణాది హీరోయిన్గా సమంత రికార్డు సృష్టించారు. ‘మా ఇంటి బంగారం’ కూడా ఆ జాబితాలో చేరితే 17వ మిలియన్ డాలర్ చిత్రంగా నిలవనుంది.
సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణకు బుక్ మై షో టికెట్ బుకింగ్స్ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. మౌత్ టాక్‌తో సినిమా మరింత బలపడుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.‘మా ఇంటి బంగారం’లో సమంత పోషించిన స్వర్ణ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళగా, సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూ మరోవైపు మాస్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టిన సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.