Baahubali Docuseries | ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించి మరో సంచలన అప్డేట్ వచ్చింది. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో రూపొందిన డాక్యుసిరీస్ 2026 జూన్ 26 శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా థియేటర్లో విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో మేకర్స్ ఈ డాక్యుసిరీస్తో సర్ప్రైజ్ ఇచ్చారు. ‘ది టార్చ్ బేరర్’ అనేది సినిమా కాదని, బాహుబలి ప్రయాణం, తెరవెనుక జరిగిన సాహసాలు, ఈ ఫ్రాంచైజీ సృష్టించిన ప్రభావం, ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా పతాకాన్ని రెపరెపలాడించిన తీరును వివరించే డాక్యుసిరీస్ అని తెలుస్తోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజన్‌తో మొదలైన ఈ మహాయజ్ఞం ఎలా ఊపిరి పోసుకుంది, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ వంటి తారలు పాత్రల కోసం ఎలాంటి కష్టాలు పడ్డారు, వేల మంది టెక్నీషియన్ల శ్రమ, వీఎఫ్ఎక్స్ వర్క్, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ వెనుక ఉన్న కథలను ఈ డాక్యుసిరీస్‌లో చూపించనున్నారు. అంతేకాకుండా బాహుబలి విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్, బాక్సాఫీస్ రికార్డులు, సాంస్కృతిక ప్రభావం వంటి అంశాలను కూడా ఇందులో పొందుపరిచినట్లు సమాచారం.
ఈ ప్రకటనతో ప్రభాస్, రాజమౌళి అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ‘జూన్ 26 కోసం వెయిటింగ్’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. సినిమా కాకపోయినా, సినిమా మించిన అనుభూతిని ఈ డాక్యుసిరీస్ ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘బాహుబలి: ది ఎపిక్’ కంబైన్డ్ వెర్షన్‌పై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.