Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఉప ఎన్నికలో మొత్తం 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని పేర్కొన్నారు. రేపు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామని చెప్పారు. ఎన్నికల కోసం మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్స్టేషన్లు ఉన్నాయని అన్నారు. వీటిలో 226 పోలింగ్ స్టేషన్లు సున్నితమైనవిగా గుర్తించామని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని అన్నారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, నిఘా పెడుతున్నామని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలతో ముగిసిందని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇంటింటి ప్రచారం మినహా ఏరకమైన ప్రచారం చేయకూడదని సూచించారు. బల్క్ మెసేజ్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిషేధమని చెప్పారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్వీ కర్ణన్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పోలింగ్ విధులకు 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ పాల్గొంటాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.50 కోట్ల నగదు సీజ్ చేశామని చెప్పారు.