KTR | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం బీఆర్ఎస్ది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వంతో తనకు మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. అధికారం అనేది టాస్క్ అని కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రం కోసం పనిచేశానని తెలిపారు. నా ప్రాంతం కోసం మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా నిబద్దతతో పనిచేశామని పేర్కొన్నారు.అధికారం అడ్డుపెట్టుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను వేధిస్తూ టైమ్‌పాస్ పనులు చేయలేదని పేర్కొన్నారు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదని.. అక్రమమ కేసులు పెట్టి వేధించలేదని చెప్పారు.
కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా అమలు చేశారని తెలిపారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశఆమని తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే స్కాంల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసులు పెడుతూ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. మేం ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. లేని దిక్కుమాలిన వార్తలు రాసి నా వాళ్లను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా.. ఏనాడూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
గత ఏడెనిమిది ఏండ్లుగా తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. డ్రగ్స్ కేసులతో సంబంధాలు ఉన్నాయని, హీరోయిన్లను బెదిరించారని వార్తలు రాయించారని తెలిపారు. మళ్లీ హీరోయిన్ల ఫోన్లు ట్యాఫ్ చేయలేదని మీరే వార్తలు రాయించారని అన్నారు. దీనంతటికీ ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డీజీపీ చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వంలో గూఢచారి వ్యవస్థ ఉంటుందని తెలిపారు.