మణికొండ, ఫిబ్రవరి 3 : కోకాపేటలో నకిలీ పట్టాలతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గండిపేట రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. ‘నకిలీపట్టాలతో మాయాజాలం’ పేరిట గత నెల జనవరి 4న ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ లో ప్రచురితమైన కథనంపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. నమస్తే కథనంపై తీవ్రస్థాయిలో స్పందించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి క్షేత్రస్థాయి అధికారులను పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేసి భాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అప్పట్లో ఆదేశించారు. ఈ నకిలీపట్టాల వ్యవహారంపై ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం కోకాపేటలోని సర్వేనెంబరు 147లో అక్రమంగా నిర్మించిన భవనాలను గండిపేట రెవెన్యూ అధికారులు పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు.
నాలుగు నిర్మాణాలు కూల్చివేశాం.
శ్రీనివాస్‌రెడ్డి, గండిపేట తహశీల్దారు
ఇంత బరితెగించి విలువైన భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కులెవ్వరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని గండిపేట తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోకాపేటలో గత రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి కోట్లు విలువచేసే భూమికి నకిలీపట్టాలతో రెక్కలు తొడిగి అన్నిశాఖల అధికారులను తప్పదోవ పట్టించిన వారిని వదిలిపెట్టబోమన్నారు. కోకాపేట గ్రామ సర్వేనెంబరు 147లో ఫోర్జరీ సంతకాలతో నాలుగు పట్టాలను గుర్తించామని, వాటన్నింటినీ మంగళవారం కూల్చివేశామన్నారు. నకిలీ పట్టాలని ఉన్నతాధికారులే తేల్చారని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న వారు ఎవ్వరైనా ఎంతటివారైనా వదిలిపెట్టబోమని తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.