KTR | ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్రను ప్రజలు గమనించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామని తెలిపారు. ఓడిపోయామని తమకు ఎలాంటి నిరాశ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై విశ్లేషించుకుంటామని.. దీనిపై ఆత్మ విమర్శ చేసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రెండేండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామని కేటీఆర్ తెలిపారు లగచర్ల, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, ఆరు గ్యారంటీల విషయంలో రెండేండ్లుగా ప్రభుత్వంపై బ్రహ్మాండంగా గొంతెత్తి పోరాడమని గుర్తుచేశారు. తమపై చేసిన ఆరోపణలను కూడా సమర్థంగా తిప్పికొట్టామని చెప్పారు. రేపటి రోజు కూడా ఇలాగే ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని చెప్పారు. గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు అని కేసీఆర్ ఎప్పడూ చెబుతుంటారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ ఎన్నిక ఎలా జరిగిందనే దానిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ఎన్ని అక్రమాలకు తెరలేపిందో నెల రోజుల ముందే చెప్పామని తెలిపారు. అభ్యర్థి సొంత తమ్ముడికి మూడు ఓట్లు ఉన్న విషయాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని.. కోర్టుకు వెళ్లామని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశామని అన్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యం అని.. దాన్ని తప్పకుండా గౌరవిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో పనిచేసే తమ్ముళ్లు, చెల్లెళ్లకు అభినందనలు చెప్పారు. మీకు ఎలాంటి జీతం ఇవ్వకపోయినా.. పార్టీ మీద, నాయకుడి మీద ప్రేమతో మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో నిరాశ పడవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. గెలుపోటములు సహజమని తెలిపారు. రబ్బర్ బంతిని గోడకు విసిరితే ఎంత బలంగా తిరిగొస్తుందో.. అలాగే మనం కూడా బలంగా వద్దామని తెలిపారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదాకా.. శక్తివంచన లేకుండా కష్టపడదామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఈ ఎన్నికల సమయంలోనే హరీశ్‌రావు తండ్రి అకాల మరణం చెందారని.. ఇవాళ కూడా తన తండ్రికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉన్నాయని.. అయినప్పటికీ పార్టీ కోసమే పనిచేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు అన్న చనిపోతే కూడా ఆయన ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేశారని తెలిపారు. అంత కమిట్మెంట్తో నాయకత్వం పనిచేసిందని వెల్లడించారు. వీరిద్దరే కాకుండా ఎంతోమంది ఇలాగే బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారని తెలిపారు. తమ కుటుంబాలను వదిలేసి.. దీపావళికి వెళ్లకుండా జూబ్లీహిల్స్లోనే మకాం వేసి బీఆర్ఎస్ కోసం పనిచేశారని అన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు పెట్టారు.