జూబ్లీహిల్స్, మే 14: ఎస్పీఆర్హిల్స్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీల్లోని వేలాది మంది ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వాటర్ రిజర్వాయర్ ఈ వేసవిలోనైనా అందుబాటులోకి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భారీ వాటర్ రిజర్వాయర్ ఇటీవల పైప్లైన్ విస్తరణ.. ఇతర పనులతో తుది మెరుగులు దిద్దుకున్నా.. ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రజలకు నీటి కోసం తిప్పలు తప్పడం లేదు.
ఎస్పీఆర్హిల్స్లోని నిర్మించిన వాటర్ రిజర్వాయర్ ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రతిభానగర్లో 2 నెలలుగా నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్తీలో 100కు పైగా కనెక్షన్లు ఉన్నాయని..ఇటీవల బస్తీకి కింద ప్రాంతంలో 20కు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో మరింత నీటికి కటకట ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభానగర్లో 2 నెలలుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. వాటర్ ప్రెషర్ లేకపోవడంతో వేసవిలో మా కష్టాలు రెట్టింపయ్యాయి..
-ఇస్మాయిల్ బీ, స్థానికురాలు