దసరా ఆఫర్ అంటూ జలమండలి అందుబాటులోకి తీసుకొచ్చిన వన్ టైం సెటిల్మెంట్ గందరగోళంగా మారింది.. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లులు చెల్లిస్తే ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందాలని వినియోగదారులకు సూచిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆచరణలో మాత్రం జలమండలి మొద్దు నిద్ర వీడలేదు. అర్హుల ఎంపిక, యాప్ విధానం అమలులో జాప్యం చేసి.. చివరకు 17 రోజుల తర్వాత (ఈ నెల 22వ తేదీ)న జలమండలి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు రోజుకు 30 నుంచి 50 మంది వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఓటీఎస్ సద్వినియోగం చేసుకున్న వారికి 50 శాతం, తొలిసారిగా ఓటీఎస్ పొందుతున్న వారు 100 శాతం రాయితీ పొందుతున్నారు. ఈ క్రమంలోనే నిబంధనల మేరకు ప్రతి నెలా రెగ్యులర్‌గా నల్లా బిల్లు చెల్లిస్తానని అఫిడవిట్ రాసి ఇవ్వాలి. కానీ, చాలా మంది అఫిడవిట్ ఇవ్వడంలో భయాందోళనకు గురవుతున్నారు. అయితే తెరపైకి సెల్ఫ్ డిక్లరేషన్ అస్ర్తాన్ని తీసుకొచ్చేందుకు జలమండలి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
-సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)
వినియోగదారులు నిబంధనల ప్రకారం యాప్ ద్వారా నల్లా బిల్లు (మాఫీ పోగా)ను చెల్లిస్తున్నారు. అయితే బిల్లు చెల్లించి వారం రోజులవుతున్నా.. మాఫీ అయినట్లు మాత్రం కనబడటం లేదంటూ జలమండలి డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారని వినియోగదారులు మండిపడుతున్న పరిస్థితి. వాస్తవంగా ఓటీఎస్‌లో బిల్లు చెల్లించిన వెంటనే బిల్లును నాలుగు దశల్లో అధికారులు వారి వారి పరిధి మేరకు అఫ్రూవల్ చేయాల్సి ఉంటుంది. మేనేజర్ స్థాయిలో రూ. 2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10వేలు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ. లక్ష వరకు , చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది. కానీ సంబంధిత బిల్లును అఫ్రూవల్ చేసే ప్రక్రియలో సాంకేతిక సమస్య (యాప్) వచ్చిందని, మంగళవారం రాత్రి వరకు సమస్య కొలిక్కి వస్తుందని డివిజన్ అధికారులు చెబుతున్నారు. అధికారుల తప్పిదానికి బిల్లు చెల్లించిన వారంతా ఆందోళన చెందుతున్నారు.
ఓటీఎస్‌కు ఈ 4న ఉత్తర్వులు వెలువడగా..31వ తేదీ వరకు తుది గడువు ఇచ్చారు. అయితే అమలులో అధికారుల వైఖరి కారణంగా చివరి తొమ్మిది రోజులు మాత్రమే ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకునేలా వినియోగదారులకు అవకాశం దక్కింది. ఆలస్యంగా ఓటీఎస్ అందుబాటులోకి రావడం… అసలే దసరా, దీపావళి జంట పండుగలు ఈ నెలలోనే రావడం, పండుగ ఖర్చులు తడిసిమోపెడు కావడంతో ఓటీఎస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఓటీఎస్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరో నెల పాటు ఓటీఎస్ గడువు పెంచాలంటూ జలమండలి అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. జలమండలికి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బకాయిలు పేరుకుపోయాయి.