Chevella | సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ ) : చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు. అభ్యర్థులు ఎవరున్నా.. కేవలం బీఆర్ఎస్ పార్టీని చూసి జనం ఓట్లు వేసి ఓటర్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు మళ్లీ హ్యాట్రిక్ విజయం అందించి రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చేవెళ్ల ప్రజలు నినదిస్తున్నారు. 2014, 2019లో చేవెళ్ల లోక్‌సభ బరిలో కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి గులాబీ జెండా రెపరెపలాడింది. తొలుత 2014లో బీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అతను పార్టీకి రాజీనామా చేసి మళ్లీ 2019లో కాంగ్రెస్ తరపున బరిలో దిగారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రజలు ఓట్లతో జవాబు చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించి గులాబీ పార్టీ దమ్ము చూపించారు.
అప్పటి వరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్‌ని చూసి మొదటిసారి గెలిచానని భ్రమలో ఉన్న అతడికి చేవెళ్ల ప్రజలు చురకలు పెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. రంజిత్ రెడ్డి కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాదిరిగానే ఓటమి రుచి చూసేందుకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. చేవెళ్ల నుంచి బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి అతడికి ఆదరణ లభించింది. చేవెళ్ల లోక్‌సభ విస్తరించి ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, తాండూర్, వికారాబాద్‌లో గులాబీ గాలులు బలంగా వీస్తున్నాయి. దీనికి తోడు చేవెళ్ల లోక్‌సభ బీఆర్ఎస్ కంచుకోటగా ఉండటం.. రెండుసార్లు బీఆర్ఎస్ జెండా ఎగిరిన ప్రాంతం కావడంతో కాసాని గెలుపు ఖాయంగా కనిపిస్తున్నదని రాజకీయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.