బంజారాహిల్స్, ఏప్రిల్ 30 : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలంటూ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు గురువారం ఆందోళన చేశారు. సేవ్ కేబీఆర్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పార్కు చుట్టూ అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారంటూ అగ్రసేన్ చౌరస్తా సమీపంలో జేసీబీలకు అడ్డుగా బైఠాయించి నినాదాలు చేశారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసేలా తవ్వకాలు జరుపుతున్నారని, వేలాది చెట్లను తొలగించారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం ఎంతవరకు సమంజసం అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రనేత, సేవ్ కేబీఆర్ ప్రతినిధి విజయ్ మల్లంగి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కి చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టును నిలిపివేసి పర్యావరణానికి నష్టం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సూచించారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ): కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులకు దాదాపు ఏడాదిన్నర దాటిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు.. 453 ఆస్తుల విషయంలో సంబంధిత యజమానులతో కమిషనర్ కర్ణన్ జరిపిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే బంజారా భవన్ వేదికగా రెండు దఫాలుగా భూ బాధితులతో సమావేశమైనప్పటికీ పరిహారం చెల్లింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందరికీ నగదు రూపంలో పరిహారం చెల్లించడం కష్టతరమని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తుండగా, దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం టీడీఆర్ పద్ధతిని ప్రతిపాదించింది. టీడీఆర్ విధానం తమకు గిట్టుబాటు కాదని, మార్కెట్ ధర ప్రకారమే పరిహారం కావాలని, టీడీఆర్‌కు తాము ఒప్పుకోమని బాధితులు ససేమిరా అనడంతో చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. వాస్తవ విషయం ఏమిటంటే అసలు కంటే.. కొసరు ఎక్కువ అన్నట్లుగా తాజాగా ప్రాజెక్టు వ్యయం రూ. 1090 కోట్లు ఉంటే..భూ సేకరణకు రూ.1543 కోట్ల మేర ఖర్చు కానున్నదని అధికారులు తేల్చారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలో ప్రభుత్వ పరిపాలన అనుమతులు ఒకలా ఉంటే.. భూ సేకరణకు అయ్యే నిధుల అంశంలో స్పష్టత లేకపోవడం.. వీవీఐపీ కారిడార్‌లో 453 ఆస్తుల స్వాధీనం అధికారులకు సవాల్‌గా మారింది.
ఈ ప్రాజెక్టుకు ముందు నుంచి సరైన ప్రణాళిక లోపించింది. భూ సేకరణపై విధి విధానాలు రూపొందించకపోవడం, కేబీఆర్ పార్కు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం భూ సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు సాగారు. ఫలితంగా క్షేత్రస్థాయిలోకి దిగిన అధికారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఇప్పటికే వ్యతిరేకించి కేబీఆర్ పార్క్ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ సినీ హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి , ఇదే కోవలో పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని నిలువరించేలా, పర్యావరణాన్ని పెంపొందించాలని ఎన్జీటీలో నమోదైన కేసు పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా ఆ పార్టీ నేతకు తోడుగా ఓ న్యూస్ యాజమాన్యం, బసవ తారకం క్యాన్సర్ దవాఖాన సమీపంలో మరో యజమానులు వేర్వేరుగా న్యాయస్థానం మెట్లు ఎక్కారు. దీంతో రోజురోజుకు న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోతున్న ఈ ప్రాజెక్టు ఇప్పట్లో మొదలు కావడం కష్టంగానే ఉందని స్వయంగా అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. అధికారులు మాత్రం వివాదం లేని ఒకటి, రెండు చోట్ల జంక్షన్లలో పనులు మొదలు పెట్టి ప్రాజెక్టు పురోగతిలో ఉన్నట్లు చూపించేందుకు చకచకా అడుగులు వేస్తుండడం గమనార్హం.
వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రోడ్ల విస్తరణ కోసం రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ (ఆర్డీపీ) ప్రకారం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అవార్డు పాస్ చేశారు. ఇప్పటికే సేకరించాల్సిన ఆస్తులకు మార్కింగ్ వేశారు. విరంచి దవాఖాన నుంచి బంజారాహిల్స్ రోడ్ నం 12 మీదుగా అగ్రసేన్ జంక్షన్ వరకు 100 ఫీట్ల రహదారిని విస్తరించనున్నారు. రోడ్ నం 12ను 80 అడుగులకు.. కేబీఆర్ పార్కు చుట్టూ 120 అడుగులకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ఆస్తుల సేకరణపై దాదాపు 50 మందికి పైగా కోర్టుకు వెళ్లారు. పారు చుట్టూ కొందరు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు చెందిన ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కేబీఆర్ చుట్టూ జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన స్థల సేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ పలువురు యజమానులు కోర్టు మెట్లు ఎక్కడం.. మరో పక్క అధికారుల సమావేశాల్లో టీడీఆర్‌కు ససేమిరా అనడంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
