సిటీబ్యూరో/మాదాపూర్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): ‘పండుగ సంబరమే లేకపాయె.. దసరాకు రోడ్డు మీద పడేసిండు రేవంత్‌రెడ్డి.. ఇదేం న్యాయమైతదా.. మాకు పండుగ లేకుండా చేసినోని ఇంట్ల పండుగెట్ల చేసుకుంటరం’టూ కొండాపూర్ హైడ్రా కూల్చివేతల బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాత్రనకా, పగలనకా మా తాతలు, తండ్రులు కష్టపడి తయారు చేసుకున్న భూమిని ఎత్తుకపోతున్నార’ని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం హైడ్రా కూల్చివేతల తర్వాత ఎక్కడి సామాను అక్కడే ఉండగానే హైడ్రా ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఎవరూ అందులోకి పోకుండా గట్టి కాపలా పెట్టింది. దీంతో స్థానికులు తమ సామగ్రి అంతా లోపలే ఉండిపోయిందంటూ బాధపడ్డారు.
తామెక్కడికి పోవాలో తెలియక ఒకవైపు వర్షం పడుతుంటే రేకుల కింద, గోడల దగ్గర తలదాచుకుంటూ బతికామని, చిన్నచిన్న పిల్లలతో ఇప్పుడెక్కడికి పోవాలంటూ బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం కొండాపూర్ భిక్షపతినగర్లో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ హైడ్రా డీఆర్ఎఫ్ వాహనం, సిబ్బంది, పోలీసులను పెట్టి అటువైపుగా ఎవరు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో స్థానికులు తమపై , తమ భూములపై మీ ప్రతాపమేంటంటూ వారిని నిలదీశారు. తమ భూములు తమకు కావాలంటూ మహిళలంతా డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
మా ఉసురు రేవంత్‌రెడ్డికి ఊరికే పోదు
దసరా సంబురం ఒక్క రోజైనా మిగల్చలేదు. అందరం కలిసి దసరా పండగ చేసుకున్నం. తెల్లవారు నాలుగు గంటల కల్లా హైడ్రా వాళ్లు మా దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి.. ఇది ప్రభుత్వ స్థలం అంటూ చెప్పారు. కాస్త సమయం కూడా ఇవ్వకుండా జేసీబీ, ప్రొక్లెయినర్‌తో మా స్థలంలో ఉన్న గుడిసెలను కూల్చివేశారు. చిన్న ప్లిలలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో ఏడుస్తూ ఉన్నారు. అయినా కనికరించకపోగా చిన్నారులు అని చూడకుండా వాళ్లను అన్యాయంగా ఇక్కడ నుంచి బయటకు వెళ్లిపోమని బలవంతంగా తోసివేశారు.
– రజిత, బాధితురాలు
ఇందిరా గాంధీ ఇస్తే .. రేవంత్ లాక్కుంటున్నాడు
అప్పుడే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు ఇందిరా గాంధీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి స్థలం ఇస్తే ఈనాడు అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి వచ్చి లాకుంటున్నాడు. మేము కష్టం చేసి ఈ భూమిని చదును చేసి బాగు చేసుకున్నం. ఇప్పుడు వచ్చి ఇది ప్రభుత్వానిదని చెబుతూ మా బతుకులను రోడ్డున వేశారు.
– శాంతమ్మ, బాధితురాలు
భూమిలో పంటలు పండించాం
నేను 8 ఏండ్లు ఉన్నప్పుడు మా నాన్నను తీసుకుపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారు. స్థానిక నాయకుడు వీళ్లకు ఏదైనా బతుకుదెరువు చూపమంటే మాకు ఈ స్థలాలు చేసుకొని బతకమని ఇందిరా గాంధీ ఇచ్చింది. ఆనాటి నుంచి ఇందులో జొన్నలు, తైదలు, మొక్కలు వంటి పంటలు పండించి బతికాం. ఇన్ని సంవత్సరాల తరువాత వచ్చి స్థలం ప్రభుత్వానిదని మా నివాసాలను కూల్చడం ఎంతవరకు మంచిది. రాత్రి వర్షానికి ఎక్కడ పడుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడ్డాం. తినడానికి తిండి లేక పిల్లలతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని దుస్థితి. ఇకనైనా మా కష్టాన్ని అర్థం చేసుకొని మా జోలికి రాకుండా మమ్ములను ఉండనివ్వండి.
– నర్సమ్మ, బాధితురాలు
నిద్రలేని రాత్రులు గడిపాం
దసరా సంబురం ఒక్కరోజైనా కాకమునుపే హైడ్రా వచ్చి ఆనందాన్ని అంతా మాకు దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చింది. రాత్రి వర్షం కురవడంతో చిన్న పిల్లలతో బిక్కుబిక్కుమంటూ తిండి తిప్పలు మాని చెట్టుకు, గోడకు కూర్చుని నిద్రలేకుండా గడిపాం. ఓ వైపు వర్షం.. మరో వైపు పిల్లల ఏడుపు ఏమి చేయాలో తోచక ఇబ్బందులు పడ్డాం. మా లాంటి పేద ప్రజల బతుకులు రేవంత్‌రెడ్డికి కనిపించవా, ఓటు వేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకునేలా చేసిండు.
– వీరమణి, బాధితురాలు