సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడి తప్పుతోంది. కూల్చివేసిన సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) వ్యర్థాల తరలింపులో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకుగానూ నగరంలో జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తూంకుంటలో నాలుగు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే గడిచిన కొన్ని నెలలుగా ఈ భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు సజావుగా జరగడం లేదు. వాస్తవంగా ఏదైనా భవన నిర్మాణం, కూల్చివేతల తాలుకా వ్యర్థాల తరలింపులో భారీ స్థాయిలో అయితే టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159లో, వాట్సప్ నంబర్ 91009 27073లో చెబితే సంబంధిత ఏజెన్సీ వారు వచ్చి వారీ వారీ ప్లాంట్లకు తీసుకువెళ్తారు. జీహెచ్ఎంసీ నిర్ధేశించిన రేటు ప్రకారం మెట్రిక్ టన్నుకు నిర్ణీత రేటును వసూలు చేస్తారు.
చిన్న స్థాయిలో (లోడు కంటే తక్కువ) ఉన్న వ్యర్థాలను సంబంధిత మేస్త్రీ ఏదో చోటకు చేర్చి ఆ తర్వాత ఏజెన్సీకి అప్పగించి సంబంధిత నగదును మేస్త్రీ తీసుకుంటారు. కానీ చాలా వరకు యాజమానులు, మేస్త్రీలు.. ఖాళీ స్థలాలు, చెరువుల పక్కన, నాలాల పక్కన రాత్రికి రాత్రే డంపింగ్ చేస్తున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను ఒక చోటకు చేర్చేందుకు ఇటీవల కాలంలో 12 కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల నుంచి వ్యర్థాలను జీహెచ్ఎంసీ కలెక్షన్ పాయింట్లో డంపింగ్ చేస్తే అక్కడ నుంచి ఏజెన్సీ తీసుకువెళుతుంది. ఇందుకు సుమారు మెట్రిక్ టన్నుకు రూ. 398.50లు, యుజర్ ఛార్జీలు రూ. 99.62లు అదనంగా వసూలు చేస్తున్నది. దీంతో జీహెచ్ఎంసీ ఆయా ఏజెన్సీలకు వ్యర్థాల తరలింపు బకాయి పడింది. దాదాపు రూ. 7కోట్లకు పైగా జీహెచ్ఎంసీ నుంచి బకాయిలు రావాల్సి ఉందని, ప్లాంట్ల నిర్వహణ భారంగా మారుతుందని ఏజెన్సీలు జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
అపరిశుభ్రంగా నగరం..
గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు దర్శనమిస్తూ నగరం అపరిశుభ్రంగా మారుతోంది. గత ప్రభుత్వం సీ అండ్ డీ ప్లాంట్లను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా నిర్వహణ చేపట్టి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ భిన్నంగా మారిందని అనడంలో ఎలాంటి సందేహం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.