హైదరాబాద్ : కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది యువకులు తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ వేదికగా కాయ్ రాజా కాయ్ అంటున్న జూదగాళ్లు… అప్పుల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. లోన్ యాప్ (Loan Apps)లో అప్పులు తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ కాస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) మరో వ్యక్తి ప్రాణాలు తీసింది.
ఆర్థికంగా నష్టపోయిన సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఉప్పల్(Uppal )పరిధి ఈస్ట్ కల్యాణపురిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కల్యాణపురికి చెందిన అర్జున్ రావు అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక అర్జున్ రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగు సైబర్ నేరగాళ్లు ఎర వేస్తున్నారు.
తొలుత కొంత లాభం ఆశ చూపి ఆ తర్వాత కదలకుండా ఉచ్చు బిగించి అందినకాడికి దోచేస్తున్నారు. ధనిక, పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, యువత అనే తేడా లేకుండా ఎవరో ఒకరు తరచూ మోసపోతూనే ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.