Hyderabad | కొండాపూర్, ఆగస్టు 17 : మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు యువ అథ్లెట్లను చితకబాదిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి స్టేడియంలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న రాథోడ్ యుగేందర్, ఆదిత్యలు శనివారం సాయంత్రం చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో పరుగు కోసం వచ్చారు. పరుగు పూర్తి చేసుకున్న అనంతరం స్టేడియంలో సమీపంలోని ఓ షాపు ముందు నిలబడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో నుంచి ఒకతను, తన పేరు కార్తీక్ అంటూ.. రాథోడ్ యుగేందర్‌ను ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
కాగా గచ్చిబౌలిలో అథ్లెటిక్ శిక్షణ పొందుతున్నామని, ఇక్కడి స్టేడియంలో రన్నింగ్ చేసేందుకు వచ్చినట్లు తెలపగా.. తీవ్ర కోపోద్రిక్తుడైన కార్తీక్ అసభ్య పదజాలంతో వారిని దూషిస్తూ, నేను నిన్ననే పోలీసు స్టేషన్‌ను వచ్చానంటూ వారిపై దాడికి పాల్పడ్డాడు. కార్తీక్ మరో 7 మందిని పిలిచి రాథోడ్, ఆదిత్యలను తీవ్రంగా చితకబాదారు. స్థానికులు వారించే ప్రయత్నం చేసిన మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆదిత్య దంతం విరిగిపోవడంతో పాటు రక్తస్రావం జరిగింది. అతని మెడలోని సిల్వర్ చైన్ సైతం కనబడకుండా పోయింది. ఈ మేరకు రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.