మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను చెరబట్టి, ఇండ్లను కూల్చేందుకు చేస్తున్న కుట్రలను భగ్నం చేసేలా బీఆర్ఎస్వీ చేపట్టిన మూసీ పోరుబాట కొనసాగుతున్నది. ఈమేరకు సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ దిశానిర్దేశంలో విద్యార్థి విభాగం నేతలు మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించి బాధితులకు మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, కడారి స్వామి, పడాల సతీష్, కే విజయ్రావుతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల బీఆర్ఎస్వీ ప్రతినిధులు మూసీ పరీవాహకంలో బాధితులను కలిసి భరోసా కల్పించారు. ఉపాధ్యక్షుడు తుంగ బాలు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధి కిస్మత్‌పూర్‌లోని హైదర్ ఎన్క్లేవ్, ఆఫీసర్స్ కాలనీ, పీజీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో సమావేశమయ్యారు.
– సిటీ బ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)
మూసీ పోరుబాట
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టారు. పేద ప్రజల జీవితాలపై అమానుషంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరతరాలుగా మూసీ నదీతీరంలో జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అనిశ్చితిలోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇండ్లు, భూములను ప్రభుత్వం లాక్కొంటుందనే మనస్తాపంతో మూసీ పరీవాహక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల ఇండ్లను చెరబట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. బస్తీల ప్రజలకు పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించడకుండా బలవంతంగా ఇండ్లను కూల్చేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ నిరంకుశ పాలనకు ప్రతిబింబంగా నిలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ బాధితులకు మద్దుతుగా పాటలు పాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంత్రి ఆధ్వర్యంలో గోషామహల్ ప్రాంతంలో కాంగ్రెస్ అరాచకాలపై అవగాహన కల్పించారు.
డప్పు దరువులు, హోరెత్తిన నినాదాలతో…
మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్వీ నేతలు డప్పు దరువులతో బాధిత ప్రజలకు అవగాహన కల్పించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను ఎండగడుతూ నినాదాలతో హోరెత్తించారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులను కలిసి మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగారు. కాంగ్రెస్ చేపడుతున్న అక్రమ కూల్చివేతలను అడ్డుకుని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పరీవాహక ప్రాంతాలైన గోల్నాకలోని తులసీనగర్ (లంక)లో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు విజయ్ రావు ఆధ్వర్యంలో పర్యటించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ యశ్వంత్, దశరథ్ బాధితులను కలిసి భరోసా కల్పించారు.
జియాగూడలోని గర్యా బాగ్‌లో నవీన్, నితీశ్, ప్రవీణ్ యాదవ్, నవీన్ కుమార్ బాధితుల వేదనను విని ఓదార్చారు. రాజేంద్ర నగర్ నియోజవర్గ జనరల్ సెక్రెటరీ అఖీరా నందన్ ఆధ్వర్యంలో ఫోర్ట్ వ్యూ కలానీ, నలందా నగర్,లో మార్కింగ్ చేసిన ఇండ్లను సందర్శించి బాధితుల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగతామని హామీ ఇచ్చారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ప్రతినిధులు అశ్వంత్, జిల్లా అశోక్, రాజు యాదవ్ బృందం సన్సిటీలోని పీ అండ్ టీ కాలనీలో పర్యటించి బాధితులతో మాట్లాడి మనోధైర్యం నింపారు. అదేవిధంగా అంబర్‌పేటలో రహమత్, గుఫ్రానుద్దీన్ బృందం పర్యటించి బాధితుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. గోషామహల్ లో విశాల్ యాదవ్ సందర్శించింది. ఉప్పల్ నియోజకవర్గం బృందం బృందావన్ కాలనీలో బాధితులను కలిశారు.
మా ఇండ్లు కూలిస్తే తరిమికొడ్తాం
కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొంటున్న ప్రజాపాలనలో పేదొళ్లు బతకొద్దా? ఏండ్ల తరబడిగా తరతరాలుగా మూసీ పరీవాహకంలో బతుకుతున్నాం? ఇవ్వాళ కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని, భూములు లాక్కొంటామంటే చూస్తూ ఊరుకుంటామా? మేం మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి, ప్రజల సొమ్ము దోచుకొని బతకట్లేం. ఎట్టి పరిస్థితుల్లో మా ఇండ్లను కూలుస్తామని వస్తే తరిమికొడ్తాం. ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ మా ఇండ్లు మా భూములు ఇవ్వం.
– మల్లక్క, తులసీరాంనగర్ (లంక)
ఇదేనా మీ ప్రజాపాలన?
మా ఇల్లు మూసీ నదిలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నడు. నదిలో ఉన్న ఇంటి నుంచి కరెంట్ బిల్లు, నల్లా బిల్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? మేముండే ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉంటే కట్టుకునేందుకు అనుమతిచ్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అప్పుడు మా ఓట్ల కోసం మీరే అనుమతిచ్చి.. భూములు అమ్ముకుని కోట్లు సంపాదించేందుకు మీరే కూలగొడ్తారా? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మా ఇండ్ల ముందుకు వస్తే ఒక్కొక్క కాంగ్రెస్ నేతలను ఉరికిచ్చి కొడ్తాం.
-బాధితురాలు, గర్యాబాగ్, జియాగూడ
ప్రజా పాలన అంటే ఇదేనా?
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలన పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రజా పాలన అంటే ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి నిరంతరం భయం గుప్పిట్లో ప్రజలు బతికేలా చేస్తున్నారు. మూసీ అభివృద్ధి కోసం నోటిఫికేషన్ ఇచ్చి 56 రోజుల తరువాత నేడు గ్రామ సభలు అంటూ అధికారులు మాకు ఆహ్వానం పంపారు. ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లినప్పుడు వారి నుంచి అపార్ట్మెంట్ స్థలాన్ని తీసుకుంటాం.. దీనిపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తెలపాలని మొసలి కన్నీరు కారుస్తున్నారే తప్ప..కచ్చితంగా చెప్పడం లేదు.
– ఆదిత్య, మధు పార్క్ రిడ్జ్ నివాసి
ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా?
రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డికి అభివృద్ధిపై ఏ విధమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మూసీ అభివృద్ధి పేరిట కాయ కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులతో కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌ను లాక్కుంటామని తేలికగా చెప్పడం చాలా బాధాకరం. ఒకసారి మధు పార్క్ రిడ్జ్ మాకు అవసరం లేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అధికారులు గ్రామసభలు పెట్టి మా అభిప్రాయాలు అడుగుతున్నారు. అసలు ప్రభుత్వ నిర్ణయం ఏమిటో అర్థం కాకుండా ఉంది. గుడి, చర్చి, మసీదులు కడతామంటున్నారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా మా నివాసాలను తీసుకుంటామంటే ఊరుకునేది లేదు.
-గిరిబాబు, మధు పార్క్ రిడ్జ్ నివాసి