గ్రేటర్‌లోని ఈది బజార్ ఏరియాలో ఐదు గంటలుగా కరెంట్ లేదని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..నగరం మధ్యలో ఉంటున్న ప్రజలు ప్రతి రోజు 4 నుంచి ఆరు గంటల పాటు కోతలు ఉంటున్నాయని ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. హిమాయత్‌నగర్‌లో ఆరేడుగంటల పాటు కరెంట్ లేదంటూ ఒక నెటిజన్ పోస్ట్ చేయగా, మరో వ్యక్తి చాంద్రాయణగుట్టలో 4 గంటలుగా కరెంట్ లేదంటూ మండిపడ్డారు. బహదూర్‌పురా, పాతబస్తీ, కొండాపూర్, యాకుత్‌ఫురా, కూకట్‌పల్లిలో కరెంట్ సరఫరా గంటల కొద్ది నిలిచిపోయింది. దీనికి కారణాలను విశ్లేషించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో అనుకూలమైన వ్యవస్థ లేకపోవడంతో తూతూ మంత్రంగా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ)
నగరంలో పలు ప్రాంతాల్లో మంగళవారం అప్రకటిత విద్యుత్ కోతలు ఇబ్బందులు పెట్టాయి. కొన్నిరోజులుగా దక్షిణ డిస్కం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో కోతల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నా ఉన్న ప్రాంతాలతో పాటు నగరంలో పట్టపగలే అంధకారం అలుముకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంట్ సరఫరాలో అంతరాయం అనేది ప్రతిరోజూ సర్వసాధారణమైంది. అప్రకటిత కరెంట్ కోతలతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రనక, పగలనకా ఎప్పుడు కరెంట్పోతుందో తెలియక జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండగా విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. అయితే కరెంట్ కోతల కారణంగా మిగతా చాలాచోట్ల మూడు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా ఉండడం లేదని పలు ప్రాంతాల వాసులు టీజీఎస్పీడీసీఎల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం అంబేద్కర్జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో చాలాచోట్ల కరెంట్ పోవడంతో నిర్వాహకులు, హాజరైన ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ కోతలు తెచ్చిందంటూ నినదించారు. తెలంగాణ భవన్‌లోనూ వేడుకల మధ్యలోనే కరెంట్ పోవడంతో సెల్ఫోన్లైట్ల వెలుగులో కార్యక్రమం కొనసాగించారు.
నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్న నేపథ్యంలో అప్రకటిత కరెంట్ కోతల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ డిస్కం సర్వీసెస్‌పై చాలా విమర్శలు చేస్తున్నారు. వర్క్‌ఫ్రంహోంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు ఈ కరెంట్ కోతలతో ఉద్యోగాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని, తమ పై అధికారుల నుంచి చీవాట్లుపడాల్సిన పరిస్థితి వస్తున్నదని, రోజుకు ఎప్పుడు కరెంట్ పోతుందో చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో గతేడాది మేలో నమోదైన కరెంట్ వినియోగం ఈసారి ఏప్రిల్ రెండోవారంలోనే నమోదవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫీడర్లపై లోడ్ పెరిగి తరచూ అంతరాయాలకు కారణమవుతున్నట్లు సిబ్బంది చెప్పారు.రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ పోతుండడంతో విసుగెత్తుతున్న ప్రజలు డిస్కంకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది ఈ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కూలర్లు, ఏసీల రూపంలో వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే కండెన్సర్లు, ఏబీస్విచ్లు, ఇన్సులేటర్లు తదితర సామాగ్రి కూడా స్టోర్స్‌లో అందుబాటులో లేకపోగా.. సబ్స్టేషన్లపై కూడా ఒత్తిడి పెరగడంతో తాము పనిచేయలేకపోతున్నామని చెప్పారు. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం కూడా కరెంట్ కోతలకు కారణమని, వారు సమ్మెలో పాల్గొనడంతో సిబ్బంది తక్కువగా ఉండి చాలాచోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులలో జాప్యం చోటుచేసుకుంటున్నదని డిస్కం అధికారులు చెప్పారు.
ఇటీవల గ్యాస్ కొరత కారణంగా నగరంలో ఇండక్షన్ స్టవ్‌ల వాడకం పెరిగింది. 1912 కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులను చూస్తున్నాం. ఎక్కడైతే కరెంట్ సరఫరాలో అంతరాయమేర్పడుతుందో చూసి అక్కడ లోడ్‌ను తట్టుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. రెండో సర్క్యూట్ వేయడం, అదనపు ఫీడర్లు ఏర్పాటు చేయడం, ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచడం, విద్యుత్ లైన్లు కరిగిపోయిన చోట వాటిని మార్చేయడం వంటివి చేస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఖచ్చితంగా ఓవర్‌లోడ్ ఉన్న పరిస్థితులను గమనించి తట్టుకునేందుకు కావలసిన ఏర్పాట్లను గురించి మాకు చెబితే అందుకు తగినట్లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేసవిలో డిమాండ్ 5వేల మెగావాట్లకు చేరుకుంటుందని అనుకుంటున్నాం. అందుకోసం నగరవ్యాప్తంగా డీటీఆర్లు, ఫీడర్లు సిద్ధం చేశాం. అయితే అనుకోకుండా వచ్చిన గ్యాస్ సమస్య కారణంగా లోడ్ పెరిగి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి.
– డా.నర్సింహులు, డైరెక్టర్ ఆపరేషన్స్, టీజీఎస్పీడీసీఎల్