సిటీబ్యూరో: నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు కరెంట్ పోతుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడుస్తుంటే.. విద్యుత్ డిమాండ్, వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈనెల 22న నగరంలో మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో విద్యుత్ డిమాండ్ 4782 మెగావాట్లు నమోదు కాగా, వినియోగం 101.07 మిలియన్యూనిట్లు నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక రికార్డుగా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యుత్ డిమాండ్ పీక్ స్టేజ్‌కు చేరడంతో పలుచోట్ల అధికలోడ్‌తో ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయని సిబ్బంది చెప్పారు. ఫీడర్లపై అత్యధికలోడ్ పడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమాదం ఉంది.
జనం విలవిల..!
ఎండలతో బయటకు పోలేక, ఇంట్లో కరెంట్‌లేక నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. చాలాచోట్ల రాత్రి అప్రకటిత కరెంట్ కోతలతో చిన్నారులు నిద్రపోవడం లేదని, తాము జాగారం ఉండాల్సిన పరిస్థితి వస్తున్నదని శివరాంపల్లితో పాటు నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ వినియోగం పెరగడంతో చాలాచోట్ల ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయని ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సరఫరాను కొనసాగిస్తున్నామని అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎంత సేపు పోతుందో తెలియక ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సిబ్బంది స్పందించకపోవడంతో కోతలపై పట్టింపు లేదంటూ మండిపడుతున్నారు.