Musi River | ఎల్బీనగర్, ఏప్రిల్ 3 : మూసీ నది మధ్యలో ఉన్న శివాలయంలో పనులు చేసేందుకు వెళ్లిన ఇద్దరు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. చైతన్యపురి ఫణిగిరి కాలనీలోని కొసగుండ్ల లక్షీ నర్సింహ్మాస్వామి దేవాలయం పక్కన శివాలయం మూసీ మధ్యలో ఓ బండపై ఉంది. ఈ ఆలయంలో ఓ దిమ్మెను నిర్మించేందుకు నాగోలు ప్రాంతానికి చెందిన ఇద్దరు మేస్త్రీలు నాగేందర్, వీరయ్యలకు నిర్వాహకులు పురమాయించారు.
కాగా గురువారం ఉదయం వాతవరణం అనుకూలంగా ఉండటంతో వారు మూసీ మధ్యలో ఉన్న శివాలయం వద్దకు చేరుకుని పనులు చేపట్టారు. అయితే గురువారం సాయంత్రం మూడున్నర గంటల నుండి భారీగా కురిసిన వర్షంతో వరదనీరు అన్ని ప్రాంతాల నుండి మూసీ నదికి పోటెత్తింది. దీంతో మేస్త్రీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శివాలయం చుట్టూరా వరదనీరు చేరడంతో గట్టువైపు వచ్చేందుకు వీలు లేకుండా పోవడంతో మధ్యలో చిక్కుకుపోయిన నాగేందర్, వీరయ్యలు ఫోన్ ద్వారా తమ బంధువులకు సమాచారం అందించారు. అంతకంతకు మూసీ నదిలో వరదనీరు పెరుగుతుండటం ఫణిగిరి కాలనీ వైపు వచ్చే వీలు లేకపోవడంతో రాత్రి వరకు వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ సమాచారం తెల్సిన వెంటనే సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుజాత, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్త మూసీ పరివాహక ప్రాంతానికి చేరుకుని కార్మికులను రక్షించేందుకు డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. వరద ఉధృతి పెరిగి మునిగిపోతామనే భయాందోళనలో ఉన్న కార్మికులకు వారు దైర్యం చెప్పారు.
మూసీ నది మధ్యలో శివాలయం వద్ద చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు డీఆర్ఎఫ్ బృందాలు మూడు గంటల పాటు శ్రమించి చివరకు వారిని క్షేమంగా కాపాడారు. మూడు గంటల పాటు కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్త, ఉప కమిషనర్ సుజాతతో పాటుగా అధికారులు మూసీ నది ఒడ్డున ఉండి పనులను పర్యవేక్షించారు. చివరికి ఇద్దరు మేస్త్రీలు క్షేమంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.