కుత్బుల్లాపూర్, మార్చి 24: మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై చెరువుగట్టుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో ప్రమాదవశత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువులో పడగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం..మెదక్ జిల్లా కంతి ప్రాంతానికి చెందిన నాందేవ్(44)భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గత కొంత కాలం కిందట నగరంలోని కొంపల్లి ఉమామహేశ్వరనగర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ ఉంటున్నాడు.
ఇటీవల తన మేనల్లుడు బాలాజీ(42) చూసేందుకు రావడంతో తనతో కలిసి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై దగ్గరలో ఉన్న వైన్స్‌షాపు వద్ద మద్యం సేవించడానికి వెళ్లారు. అయితే తిరిగి కొంపల్లి ఫాక్స్ సాగర్ చెరువు కట్టపై వస్తుండగా.. చీకటిగా ఉండటంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువులో పడింది. సోమవారం ఉదయం పేట్‌బషీరాబాద్ పోలీసులకు 100 ద్వారా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా.. చెరువులో రెండు శవాలు తేలుతూ కనిపించాయి. స్థానికుల సహకారంతో పోలీసులు శవాలను బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.