Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి 11 ఏండ్ల బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఏఈ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ బీఎం హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఈఈ ఇందిరాభాయికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి పలు చోట్ల వరదలు ఉప్పొంగాయి. కళాసిగూడలో వరద పోటెత్తడంతో నాలా సమీపంలో భూమికి రంధ్రం పడింది. కిరణా సరుకుల నిమిత్తం బయటకు వచ్చిన మౌనిక(11) ఆ రంధ్రంలో పడి నాలాలోకి కొట్టుకుపోయింది. దీంతో పాప చనిపోయింది. ఘటనాస్థలిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.