సిటీబ్యూరో, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి పల్నాడు జిల్లాకు చెందిన పగడాల ఉమామహేశ్, హైదరాబాద్‌కు చెందిన నవీన్ అనే ఇద్దరు ఘరానా మోసగాళ్లు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులను మోసం చేసి రూ.70లక్షలు కొట్టేశారు. దేశవ్యాప్తంగా 87 కేసుల్లో నిందితుడుగా ఉన్న నవీన్ తెలంగాణలోనే 14 కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. నిందితుడి నుంచి ఒక మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నవీన్ చేతిలో ఆన్లైన్ మోసానికి గురై రూ.25.36లక్షలు కోల్పోయారు. బాధితుడికి గూగుల్ మ్యాప్స్ రివ్యూలతో కూడిన పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ చేస్తూ వాట్సప్ మెసేజ్ వచ్చింది. అదినిజమేనని భావించిన బాధితుడు దానిపై ఆరా తీశాడు. నవీన్ రెండు గూగుల్ మ్యాప్ లింక్‌లను షేర్ చేసి వాటిని రేట్ చేసి స్కీన్ష్రాట్లను తీసి పంపమని సూచించాడు.
ఆ తర్వాత టెలిగ్రామ్ ఐడిని ఇచ్చి బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకున్నాడు. తక్కువ సమయంలో పెట్టుబడి ద్వారా ఎక్కువ లాభాన్ని పొందవచ్చంటూ ఒక వెబ్సైట్ లో నమోదు చేసుకోమని బాధితుడిని ఒప్పించాడు. నవీన్ మాటలు నమ్మిన బాధితుడు వెబ్సైట్లో నమోదు చేసుకున్నాడు. ట్రేడింగ్ మరియు పెట్టుబడికి సంబంధించిన సూచనలు ఫాలో అవుతూ టెలిగ్రామ్‌లో నవీన్ ఇచ్చిన బ్యాంక్ ఖాతాలు మరియు యూపిఐ ఐడిలకు డబ్బులు బదిలీ చేశాడు. కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత బాధితుడు తన నిధులను విత్‌డ్రా చేసుకోవాలని చూస్తే అవి విత్ డ్రా కాలేదు. మరిన్ని డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఇన్స్పెక్టర్ ఆఫ్‌పోలీస్ సతీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎస్ సురేశ్, పిసిలు రాజేశ్, మల్లేశంలు ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఉమామహేశ్ నుంచి గోల్డ్‌మన్ సాక్స్ గోల్డ్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నానని ఆర్ధిక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటూ ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపారు. యూజర్ఐడి, పాస్వర్డ్ ఉపయోగించి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించాడు. బాధితుడు వెబ్సైట్లో తన మొదటి పెట్టుబడిగా పది నలబైవేలు బదిలీ చేశాడు. వెబ్సైట్ లాభాల్లో కొంత భాగాన్ని విత్ డ్రా చేసుకోవడానికి అవకాశమివ్వడంతో బాధితుడు ఆ సైట్ నిజమైందేనని నమ్మాడు. మొత్తం రూ.43,36,146 వివిధ బ్యాంక్ ఖాతాల్లో వివిధ మొత్తాల్లో డిపాజిట్ చేశాడు.
తన ఎమౌంట్‌ను విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తే రిస్క్ ఫీజు, ఎక్స్ఛేంజ్ ఫీజ్ అంటూ అదనపు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇన్స్పెక్టర్ సీతారాములు,ఎస్ఐ భవాని, ఏఎస్ఐ వెంకటేశ్, పిసిలు అబ్జర్, ప్రియాంక, ప్రతాప్‌లు ఈ కేసును ఛేదించారు. ఈ రెండు కేసుల్లో నిందితులను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.